ఏపీలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఆగస్టు 20వ తేదీ నాటితో పోలిస్తే ఆదివారం (సెప్టెంబరు 20) నాటికి నమోదైన కేసుల్లో 92.23 శాతం, మరణాల్లో 78.57 శాతం మేర పెరుగుదల ఉంది. ఈ కాల వ్యవధిలో ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 194.28 శాతం మేర కేసుల వృద్ధి కనిపించగా...142.61 శాతంతో నెల్లూరు జిల్లా రెండో స్థానంలోనూ, 117.90 శాతంతో విజయనగరం జిల్లా మూడో స్థానంలోనూ ఉంది. అనంతపురం జిల్లాలో అతి తక్కువగా 62.06 శాతం మాత్రమే పెరుగుదల ఉంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 70,455 మందికి రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 7,738 (10.98శాతం) మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో తాజాగా మరో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 6,25,514కి, మరణాలు 5,359కి చేరాయి.
- 24 గంటల వ్యవధిలో వచ్చిన కొత్త కేసుల్లో 1,260 (16.28 శాతం) తూర్పుగోదావరి జిల్లా, 1,005 (12.98 శాతం) పశ్చిమగోదావరి జిల్లాల్లోనే వచ్చాయి.
- 24 గంటల వ్యవధిలో 10,608 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు
- ప్రస్తుతం 78,836 క్రియాశీలక కేసులున్నాయి.