కరోనా తీవ్రత రాష్ట్రంలో నానాటికీ పెరుగుతోంది. ఓ పక్క రికార్డు సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తుండగా... మరోపక్క అదే స్థాయిలో కేసులూ నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 497 కేసులు నమోదు కాగా 10 మంది మరణించారు. చనిపోయిన వారిలో పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన ఓ ప్రైవేటు వైద్యుడు ఉన్నారు. కొత్త వాటిని కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసులు 10,331కు చేరాయి. జూన్ 1న అన్‌లాక్-1 అమల్లోకి వచ్చినప్పటి నుంచి బుధవారం వరకు అంటే 24 రోజుల్లో వచ్చిన కేసులు 6,650. చనిపోతున్న వారి సంఖ్యా పెరుగుతోంది. కొత్తగా నమోదైన మరణాలను కలిపితే రాష్ట్రంలో మృతుల సంఖ్య 129కి చేరింది. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిలోనూ పాజిటివ్ కేసులు ఎక్కువగా బయట పడుతుండటం మరింత ఆందోళనకరంగా మారింది.
రాష్ట్రంలో బుధవారం తొలిసారి భారీగా 36,047 నమూనాలను పరీక్షించారు. ఇందులో స్థానికంగా 448 కేసులు వచ్చాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో 12, పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 37 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో ఒక్కరోజే 90 కేసులు వచ్చాయి. ఈ జిల్లాలో స్థానికంగా నమోదైన కేసులు 1,028కి చేరాయి. కొత్తగా వచ్చిన వాటితో కలిపి కృష్ణా జిల్లాలో 1,132, కర్నూలు జిల్లాలో 1,483 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారు. కృష్ణా (43), కర్నూలు (42) జిల్లాల్లో మరణాలు ఎక్కువ. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 5,423 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 4,779 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు.
కువైట్ నుంచి 314... మహారాష్ట్ర నుంచి 801
విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిలో కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా కువైట్ నుంచి వచ్చిన వారిలో 314, మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిలో 801 కేసులు తేలాయి. రాష్ట్రంలో మొత్తం 10,331 పాజిటివ్ కేసులు నమోదవగా, ఇందులో ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారు 2,088 (20.21%) మంది. బుధవారం ఉదయం దాకా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 1,703, విదేశాల నుంచి వచ్చిన వారిలో 385 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
- వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసే రోజువారీ రాష్ట్రస్థాయి బులెటిన్‌లో... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిని మే 5 నుంచి, విదేశాల నుంచి వచ్చినవారిని మే 24 నుంచి విడిగా చూపుతున్నారు.
- మే 5 నుంచి జూన్ 24 వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 1,661 మందికి కరోనా సోకింది. వారిలో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ నుంచి వచ్చింది 85.55 శాతం మంది. మే 5కు ముందు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 42 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
- రాష్ట్రంలో తొలి పాజిటివ్ కేసు విదేశాల నుంచి వచ్చినవారి వల్లే నమోదైంది. మే 23 వరకు విదేశాల నుంచి వచ్చిన 21 మందికి కరోనా సోకగా, మే 24 నుంచి జూన్ 24 వరకు మరో 364 మంది ఉన్నారు. వీరిలో కువైట్ నుంచి వచ్చినవారే 86.26% మంది.
- విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కరోనా రోగుల్లో మరణాలు సంభవించలేదు.