Covid In Gandhi Hospital: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. ఆస్పత్రిలో ఏడుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందని సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. గాంధీలో కొవిడ్ కేసులు ఎక్కువగా వచ్చాయన్న ప్రచారం జరుగుతోందని చెప్పిన ఆయన.. అందులో నిజం లేదన్నారు.
గాంధీలో ఆపరేషన్లు నిలిపివేత...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కాని శస్త్రచికిత్సలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫలితంగా ఇవాళ్టి నుంచే గాంధీలో అత్యవసరం కాని శస్త్రచికిత్సలు నిలిపివేయనున్నారు. అత్యవసర శస్త్ర చికిత్సల్లో ఎలాంటి ఆటంకం ఉండదని వెల్లడించింది.
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా త్వరలో గాంధీలో జీనోమ్ సీక్వెన్సింగ్ ఏర్పాటు చేస్తామని గాంధీ ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఒమిక్రాన్‌కు కొత్తగా చికిత్స లేదని పేర్కొన్నారు. తప్పక అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
ఏపీలోనూ భారీగా కేసులు..
Corona cases in AP: మరోవైపు ఏపీలోనూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24గంటల్లో.. 24,280 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,831 కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో..7,195 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 242 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 467 కరోనా కేసులు నమోదు కాగా.. విశాఖ జిల్లాలో 295, కృష్ణా జిల్లాలో 190 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 164, అనంతపురంలో 161, నెల్లూరులో 129, శ్రీకాకుళం జిల్లాల్లో 122 కొవిడ్ కేసులు నమోదయ్యాయి
ఇదీచూడండి:Corona cases in AP: రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు