కరోనా విషయంలో ఇప్పుడే సంబరపడిపోవటానికి లేదని తాజా పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి. ఆ మహమ్మారి ఇంకా చావలేదనీ గుర్తుచేస్తున్నాయి. తిరిగి కేసుల సంఖ్య పెరుగుతోంది మరి. కరోనా భయాన్ని పోగొట్టటానికి మొదట్లో వైద్యులు, నిపుణులు ఇచ్చిన ఉపశమన వచనాలే ఇప్పుడు బెడిసికొడుతున్నట్టు కనిపిస్తున్నాయి. మనకు రోగనిరోధకశక్తి ఎక్కువన్న ధీమానో, మరణాలు అంతగా లేవన్న భరోసానో, టీకా వచ్చిందన్న ధైర్యమో, ఆసుపత్రుల్లో చికిత్స సదుపాయాలు ఉన్నాయన్న నిబ్బరమో.. కారణమేదైనా కొవిడ్-19 అంటే ప్రస్తుతం మనలో నిర్లక్ష్య భావన పెరిగిపోయింది.
బయటకు వెళ్లినప్పుడు మాస్కు ధరించాలనే విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు. మొదట్లో జేబులో శానిటైజర్ పెట్టుకొని వెళ్లినవారే ఇప్పుడు వీటి వంకైనా చూడటం లేదు. కనీసం తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవాలన్న స్పృహ కూడా ఉండటం లేదు. ఇలాంటి నిర్లక్ష్యమే సార్స్-కోవీ 2 చాపకింద నీరులా విస్తరించేలా చేస్తోంది. అదృష్టం కొద్దీ కరోనా జబ్బు విదేశాల్లో మాదిరిగా మనదగ్గర అంత ఉద్ధృతంగా లేకపోవచ్చు. పెద్ద వయసువారి సంఖ్య తక్కువగా ఉండటం, అప్పటికే ఇతరత్రా కరోనా వైరస్ రకాల ఇన్‌ఫెక్షన్లు వచ్చి ఉండటం, వీటితో కొత్త కరోనా వైరస్‌ను తట్టుకునే శక్తి లభించి ఉండటం వంటివన్నీ వరంగా పరిణమించి ఉండొచ్చు. కానీ ఇటీవలి కాలంలో కరోనా జబ్బు మళ్లీ పెరుగుతున్నమాట మాత్రం నిజం. ఒక్క నెలలోనే కొవిడ్-19 కేసులు రెట్టింపయ్యాయి. ఇవన్నీ పూర్తిగా నివారించుకోదగ్గవే. అయినా ఎందుకింత నిర్లక్ష్యం? ఇతరదేశాల్లోనూ ముందు కేసుల సంఖ్య తగ్గిపోయి, అనంతరం పెరుగుతూ వస్తున్నాయి. మనకూ అలాంటి పరిస్థితే ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.
మొదట్లోనూ కరోనా మనదగ్గర 6 నెలల తర్వాతే మొదలయ్యిందనే విషయం మరవరాదు. దీంతో మనదేశంలోనూ తిరిగి ఉద్ధృతమవ్వచ్చనే భయం పుడుతోంది. అందువల్ల కీడెంచి మేలెంచాలి. అంత ఉద్ధృతం కాకపోతే మంచిదే గానీ అసలు జబ్బే రాదనే అతి విశ్వాసం పనికిరాదు. ఇటీవల సార్స్-కోవీ 2 కొత్తరకాలూ పుట్టుకొస్తున్నాయి. ఇవి చాలా వేగంగానూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్నాయి. వైరస్ జన్యుక్రమాన్ని అంతగా విశ్లేషించలేకపోవటం వల్ల బయటపడటం లేదు గానీ ఇవి మనదేశంలోనూ ఉండే అవకాశం లేకపోలేదు. కాబట్టి నిర్లక్ష్యం తగదు. కరోనా తిరిగి వస్తుందా? అని కాదు.. కరోనా ఎక్కడికీ పోలేదు, ఇక్కడే ఉందనే సంగతిని తెలుసుకొని నడచుకోవాలి.
లక్షణాలుంటే వెంటనే చికిత్స
కరోనా జబ్బు తీవ్రమై, ప్రాణాపాయ స్థితికి చేరుకున్నవారిలో చాలామంది చికిత్స ఆలస్యమైనవారే. కాబట్టి దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలుంటే జబ్బు ఉందనే అనుకోవాలి. నిర్ధారణ పరీక్ష చేయించుకొని వెంటనే చికిత్స తీసుకోవాలి. లక్షణాలు ఉండి, పరీక్ష నెగెటివ్ వచ్చినా కూడా మందులు వాడుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులుంటే ఏమాత్రం ఆలస్యం చేయరాదు. ఇప్పుడు కరోనా చికిత్స దాదాపుగా ఓ ప్రామాణిక రూపు సంతరించుకుంది. త్వరగా చికిత్స ఆరంభిస్తే జబ్బు తీవ్రం కాకుండా, మరణాలు సంభవించకుండా చూసుకోవచ్చు.
మరణాలు తక్కువే అయినా..
కరోనాజబ్బు మీద భయం తగ్గటానికి ప్రధాన కారణం మరణాల సంఖ్య తక్కువగా ఉండటం. అంతమాత్రాన ఎవరికి ప్రాణాంతకంగా మారుతుందన్నది ముందే తెలియదు. జబ్బు ముదురుతున్నకొద్దీ తీవ్రత బయటపడుతుంది. చికిత్సకయ్యే ఖర్చు, కుటుంబం పడే ఇబ్బందుల వంటివి పక్కనపెడితే.. జబ్బు నుంచి కోలుకున్నా కరోనా దుష్ప్రభావాలు దీర్ఘకాలం వెంటాడుతూ వస్తున్నాయని మరవరాదు. ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు.. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, నిస్సత్తువ, నీరసం, ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడటం, కొందరికి కొత్తగా మధుమేహం తలెత్తటం, కొవిడ్ చికిత్సలో వాడే మందులతో కొందరికి ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల వంటి ఇబ్బందులెన్నో చుట్టుముడుతున్నాయి. మగవాళ్లలో కొందరిలో తాత్కాలికంగా వీర్యం నాణ్యత, శుక్రకణాల కదలిక తగ్గుతున్నట్టూ కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాతా కొందరికి సిరల్లో, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు ఏర్పడటం, పక్షవాతం, గుండెజబ్బుల వంటి తీవ్ర సమస్యలూ దాడిచేస్తున్నాయి. ఇలాంటి ఇబ్బందులేమీ లేకపోయినా చాలామందిలో శరీర సామర్థ్యం, బలం తగ్గిపోతుండటం గమనార్హం. అందువల్ల మరణాలు తక్కువన్న దృష్టితో తేలికగా తీసుకోవటం తగదు. జాగ్రత్తలను విడవకుండా పాటించాలి.
* బయటకు ఎక్కడికి వెళ్లినా విధిగా మాస్కు ధరించాలి.
* ఇతరులకు కనీసం 2 మీటర్ల దూరంలో ఉండాలి.
* తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవాలి. సబ్బుతో కడుక్కునే వీలు లేకపోతే చేతులకు శానిటైజర్ రాసుకోవాలి.
వీటిని కచ్చితంగా పాటించటం మనందరి విధి, బాధ్యత. వీటితో కరోనా జబ్బు బారినపడకుండా చాలావరకు కాపాడుకోవచ్చు.