రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మూడు జిల్లాల్లోనే మరోసారి ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో పెద్ద సంఖ్యలో బయటపడుతున్న కేసులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం ఉదయానికి 73 కేసులు తేలగా మొత్తం కేసుల సంఖ్య 1332కి చేరింది. విజయనగరం, నెల్లూరు మినహా అన్ని జిల్లాల్లోనూ కొత్త కేసులు నమోదయ్యాయి. 7727నమూనాలు పరీక్షించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇంకా అదే ఒరవడి కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో బుధవారం 29 మందికి, కృష్ణాలో 13, కర్నూలులో 11మందికి వైరస్ సోకింది. మొత్తం మీద కర్నూలులో ఇప్పటికే 300 కేసులు దాటిపోగా గుంటూరు అదే బాటలో ఉంది. కృష్ణాలో 200 దాటాయి.
గుంటూరు జిల్లాలో
గుంటూరు జిల్లాలో మరో 29 మందికి వైరస్ సోకింది. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 283కి పెరిగింది. 26 కేసులు ఒక్క నరసరావుపేట నుంచే నమోదు కావడం ఆందోళన రేపుతోంది. వరవకట్ట, రామిరెడ్డిపేట, అరండేల్ పేట, పెద్దచెరువు, ఏనుగు బజార్, పాతూరు ప్రాంతాల్లో వైరస్ విజృంభిస్తోంది. కేసుల తీవ్రతతో నరసరావుపేట పూర్తిస్థాయి లాక్ డౌన్‌లోకి వెళ్లింది. మిగిలిన 3 కేసుల్లో గుంటూరు అర్బన్ పరిధిలో 2, సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో ఒకటి నమోదయ్యాయి. గుంటూరు అర్బన్‌లో కేసుల సంఖ్యలో క్రమంగా తగ్గుదల కన్పిస్తుండగా.. గ్రామీణంలో మాత్రం బాధితులు పెరుగుతున్నారు. కరోనా తీవ్రతతో నరసరావుపేటలో పర్యటించిన గ్రామీణ ఎస్పీ విజయరావు సిబ్బందికి సూచనలు చేశారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న వరవకట్ట, రామిరెడ్డిపేట ప్రాంతాల్లో బందోబస్తును పర్యవేక్షించారు.