తెలంగాణలో డిసెంబర్ 1న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం గ్రేటర్‌లోని 150 డివిజన్లలో 1,122 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నగరంలోని 74 లక్షలకు పైగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కొవిడ్ నిబంధనల ప్రకారం...
అన్ని పోలింగ్ కేంద్రాల్లో కొవిడ్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా ఒకరోజు ముందు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని శానిటైజ్ చేయనున్నారు. నవంబర్ 1 తరువాత కరోనా పాజిటివ్ వచ్చిన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం ఎస్ఈసీ కల్పించింది. వీరితో పాటు 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు కరోనా నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం కల్పించారు. పోస్టల్ బ్యాలెట్‌ను ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్‌కు కూడా అధిక శాతం మంది దరఖాస్తులు చేసుకున్నారు.
కరోనా బాధితులు కూడా...
పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకోని కరోనా పాజిటివ్ ఓటర్లకు పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే సౌకర్యాలు కల్పించింది. బాధిత ఓటర్లు ప్రతి పోలింగ్ కేంద్రంలో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల లోపు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. వారంతా మాస్క్, ఫేస్ షీల్డ్, గ్లోవ్స్ ధరించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని ఓటు వేయాలని స్పష్టం చేసింది. గ్రేటర్‌లోని 30 సర్కిళ్లలోని సహాయ వైద్య అధికారులను సర్కిల్ స్థాయిలో కొవిడ్ నోడల్ అధికారులుగా జీహెచ్ఎంసీ నియమించింది.