తెలంగాణలో మొక్కజొన్న(మక్క) సాగుచేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మద్దతు ధరకు కొనేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ అనుమతి ఇవ్వలేదు. మద్దతు ధరకు కొంటామని ‘రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య’(మార్క్‌ఫెడ్) సైతం ఎలాంటి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపలేదు. కానీ ప్రస్తుత యాసంగిలో సాగుచేసిన పంటంతా మద్దతు ధరకు కొనాలంటే రూ.3,442 కోట్లు అవసరమని మార్క్‌ఫెడ్ లెక్కలుగట్టింది.
ఈ సంస్థ కొన్నేళ్లుగా కొన్న పంటల రూపేణా ఇప్పటికే రూ.2 వేల కోట్ల నష్టాల్లో ఉంది. ఇప్పుడు సొంతంగా దేన్నీ మద్దతు ధరకు కొనే పరిస్థితి లేదు. మొక్కజొన్నను రాష్ట్ర ప్రభుత్వం కొనాలని ఆదేశిస్తే నిధులు సమకూర్చాలి. ఒకవేళ సర్కారు నిధులివ్వకపోతే ఈ సొమ్మును బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవడానికి పూచీకత్తయినా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఏడాది దేశచరిత్రలోనే అత్యధికంగా 3 కోట్ల టన్నుల మొక్కజొన్నల దిగుబడి వచ్చిందని కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా వెల్లడించడంతో పంట ధరలు పతనమవుతున్నాయి
తెలంగాణలో వ్యాపారులు క్వింటాకు రూ.1000 నుంచి రూ.1500కి మించి ఇవ్వడం లేదు. మొక్కజొన్న పంటపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది. జాతీయ మార్కెట్‌లో గిరాకీ లేదని, ప్రస్తుత యాసంగిలో సాగుచేయవద్దని సీజన్ ఆరంభంలోనే రైతులకు వ్యవసాయశాఖ సూచించింది. అయినా.. రైతులు ఏకంగా 4.66 లక్షల ఎకరాల్లో అదే పంట వేశారు. మొత్తం 15.91 లక్షల టన్నుల దిగుబడి రావచ్చని మార్కెటింగ్‌శాఖ తాజా అంచనా. మద్దతు ధర క్వింటాకు రూ.1850 చొప్పున చెల్లించి కొనాలంటే మార్క్‌ఫెడ్ వద్ద నిధులు లేవు. కేంద్రం మద్దతు ధరకు కొనే పంటల్లో మొక్కజొన్నను తెలంగాణకు అనుమతించలేదు. ఇప్పుడిక రైతులను ఆదుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోనే కొనాలి.