బల్దియా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలతో బల్దియా ప్రచారక్షేత్రంలో వాతావరణం ఒక్కసారిగా వేడేక్కింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని గెలుచుకోగానే.... పాతబస్తీలో అక్రమంగా ఉంటున్న ఇతర దేశాల వారిని వెళ్లగొట్టేందుకు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తామని బండి సంజయ్ అన్నారు. రోహింగ్యాలు వచ్చి అక్రమంగా ఉంటే వెళ్లగొట్టాలా? వద్దా ? అని ప్రశ్నించారు. పాతబస్తీలో పాకిస్తానీలు, రోహింగ్యాలు ఓట్లు వేస్తున్నారని బండిసంజయ్ ఆరోపించారు.
తీవ్రస్థాయిలో స్పందించిన కేటీఆర్
బండిసంజయ్ వ్యాఖ్యలపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓట్లు, సీట్ల కోసం భాజపా నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. పచ్చని హైదరాబాద్‌ను పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలతో పోలుస్తారా? అని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసం కోటిమందిని బలితీసుకుంటారా? అని ప్రచార రోడ్‌షోలలో నిలదీశారు. సర్జికల్ స్ట్రైక్ చేయడానికి హైదరాబాద్ దేశ సరిహద్దుల్లో లేదని.... శత్రుదేశంలో అంతకన్నా లేదని కేటీఆర్ మండిపడ్డారు.
ఖండించిన కాంగ్రెస్
పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఖండించింది. బండి సంజయ్ అసలు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. శత్రు స్థావరాలపై నిర్వహించాల్సిన సర్జికల్ స్ట్రైక్ సొంత దేశంలో నిర్వహిస్తాననడం సరైంది కాదని విమర్శించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ పై ఎన్నికల కమిషన్, పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.