నాలుగు దశాబ్దాలుగా దేశంలో ఏ మూల ప్రకృతి కన్నెర్రజేసినా.. ఈనాడు పిలుపునివ్వటమే ఆలస్యం...బాధితులను ఆదుకోవటానికి మేమున్నామంటూ చేయందించారు పాఠకులు. విశాల హృదయంతో వారిచ్చిన నిధులే ఇళ్లుగా..బడులుగా మారి.. మనసారా వారు చేసిన సాయానికి సార్థకత చేకూర్చాయి. కేరళ విషయంలోనూ అంతే. కిడ్డీబ్యాంకుల్లో దాచుకున్న డబ్బు తెచ్చిచ్చిన చిన్నారుల్నీ, పింఛను సొమ్ము నుంచి కూడా కొంత మొత్తం తీసి ఇచ్చిన వృద్ధుల్నీ... అందరినీ కదిలించింది...కేరళ ప్రజల కష్టమే.
సంప్రదింపులు, చర్చల తర్వాతే కార్యరూపం...
ప్రజలిచ్చే సొమ్ముకు కచ్చితమైన లెక్క ఉండాలి. లేదంటే వారు నమ్మకంతో చేసే సాయానికి విలువ ఉండదు. అందుకే ఏ రోజుకారోజు సహాయనిధికి ఎవరెవరు ఎంతిచ్చారన్నది పత్రికాముఖం గానే ప్రచురించింది..ఈనాడు. నిధులతో ఏం చేయాలి..? ఎలా ఖర్చు చేస్తే బాగుంటుంది? అన్నది బాధిత ప్రాంత అధికారులతో, నాయకులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంది. స్థలమూ, లబ్ధిదారుల ఎంపికా వారి సూచన మేరకే. తరవాత...ఆ పథకానికి కార్యరూపమిచ్చే బాధ్యతను ప్రతిష్ఠాత్మక సంస్థలతో పంచుకుంది.
ప్రతి అడుగులో భాగస్వామ్యం
ఈ క్రమంలో రామకృష్ణ మఠం, స్వామినారాయణ్ సంస్థ, కుటుంబశ్రీలాంటి సంస్థల సహకారం మరువ లేనిది. అలాగని డబ్బిచ్చి చేతులు దులుపుకోలేదు. నిర్మాణాలు పూర్తై, లబ్ధిదారులకు అందజేసి, నిర్వహణ బాధ్యతను స్థానిక గ్రామపంచాయతీలకు అప్పజెప్పే వరకూ ఈనాడు పాత్ర ఉంది. ప్రతి రూపాయి ప్రతిఫలం కనిపించేలా ఈ పథకాల కార్యాచరణ జరగటం ముఖ్యమైన అంశం. పై ఖర్చులన్నింటినీ సంస్థే భరిస్తూ సహాయనిధిని పొదుపుగా, అవకాశం ఉన్న చోటల్లా ఖర్చు తగ్గించుకుంటూ చేయటం వల్లే ఇది సాధ్యమైంది.
అడుగుపడింది నాడే..
అది 1976 వ సంవత్సరం..ఒకే ఏడాదిలో దివిసీమ ప్రాంతంలో వరుసగా 3 తుపాన్లు విరుచుకుపడ్డాయి. అప్పుడే తొలిసారిగా తుపాను సహాయనిధిని ప్రారంభించింది ఈనాడు. దానికి విశేష స్పందన లభించింది.
⦁ పాఠకుల నుంచి దాదాపు రూ.65 వేలు విరాళాల రూపంలో రాగా..సీఎం సహాయనిధికి అందించారు.
⦁ 1977నవంబరులో కృష్ణాజిల్లా పాలకయతిప్ప గ్రామాన్ని వరదలు ముంచేశాయి . అప్పుడు రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో వరదలకు తట్టుకునేలా దాదాపు 112 పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చింది ఈనాడు. ఇళ్లు కట్టగా మిగిలిన డబ్బుతో పక్కనే కృష్ణాపురం అనే ఊళ్లో మరో 22మందికి నీడ కల్పించారు.