జాతీయ రహదారుల పనులకు పోటీపడుతున్న గుత్తేదారులు.. రాష్ట్ర, జిల్లా రహదారుల(state highways) పనులపై ఆసక్తి చూపడం లేదనడానికి పక్క చిత్రాలే ఉదాహరణ. జాతీయ రహదారుల పనులు చిన్నవైనా ఎక్కువమంది ముందుకొస్తున్నారు. అదే ఆర్‌అండ్‌బీ పరిధిలోని జిల్లా ప్రధాన రహదారులు (ఎండీఆర్), రాష్ట్ర రహదారులు (ఎస్‌హెచ్) పనులకు ఎవరూ బిడ్లు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలో 8,970 కి.మీ. మేర దెబ్బతిన్న రాష్ట్ర, జిల్లా రహదారులను రూ.2,205 కోట్లతో పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
దీనికోసం రూ.2 వేల కోట్ల బ్యాంకురుణం తీసుకునేందుకు అవకాశం కల్పించింది. అధికారులు 1,140 పనులకు టెండర్లు పిలిస్తే గుత్తేదారులు స్పందించలేదు. రెండోసారి రాయలసీమ జిల్లాల వరకు బిడ్లు వేసేలా చూడగలిగారు. కోస్తాలో విజయనగరం మినహా 8 జిల్లాల్లో ఎక్కడా బిడ్లు రాలేదు. మూడోసారి టెండర్లు పిలిచినా అదే పరిస్థితి. ఇప్పటివరకు 403 పనులకే టెండర్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ నిధుల విడుదలతో సంబంధం ఉండదని, నేరుగా బ్యాంకునుంచే బిల్లులు చెల్లిస్తామని అధికారులు చెప్పినా గుత్తేదారులు రావట్లేదు.
డిపాజిట్లు కట్టేందుకూ డబ్బుల్లేవు
టెండరులో పాల్గొని పని దక్కించుకుంటే, డిపాజిట్ చెల్లించేందుకూ డబ్బుల్లేవని కొందరు గుత్తేదారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ప్రభుత్వం తాము చేసిన పనులకు కొంతమేర బిల్లులు చెల్లించినా అవి రెండేళ్ల వడ్డీలకే సరిపోయాయని అంటున్నారు. గత ఏడాది వర్షాలతో దెబ్బతిన్న రహదారులకు అత్యవసర మరమ్మతులు చేశామని, వాటికి రూ.388 కోట్లు ఇంకా చెల్లించలేదని వివరించారు. పాత బిల్లులు చెల్లించేవరకూ బిడ్లు వేయబోమని, ఈ విషయంలో తామంతా ఒకేమాటపై ఉన్నామని వారు స్పష్టం చేస్తున్నారు.