ఒప్పంద వ్యవసాయం ఒప్పందాల్లో భూమిపై వ్యాపారికి ఎలాంటి హక్కు ఉండదు. ఒప్పందాలన్నీ ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవడానికి వీలుగా రాష్ట్ర స్థాయి అథారిటీని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. ఒప్పంద సేద్యం ఆర్డినెన్స్‌లో కేంద్రం పలు షరతులు విధించింది. మరోవైపు, దేశ వ్యాప్తంగా ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఒప్పంద సేద్యంపై రైతులు, రైతు సంఘాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
రాతపూర్వకంగా తెలియజేయాలి..
రైతు పండించే పంటకు ఎంత ధర చెల్లిస్తారనేది పూచీకత్తునిస్తూ ముందుగా ఒప్పందంలో రాతపూర్వకంగా తెలియజేయాలి. ఆ ధర పంట అమ్మే వ్యవసాయ మార్కెట్‌లో ఉన్న ధరలకు అనుగుణంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో ఒప్పంద సేద్యం-కాంట్రాక్ట్ ఫార్మింగ్ విధానం అమలుకు అనుమతిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌కు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది. ఈ ఆర్డినెన్స్ కింద ఒప్పందం చేసుకుని పండించిన పంటలకు రాష్ట్ర మార్కెటింగ్ చట్టం వర్తించదు. వాటి నిల్వ, అమ్మకాలకు "నిత్యావసర సరకుల చట్టం- 1995" సహా మరే చట్టం వర్తించదు. అన్ని ఇతర రకాల నియంత్రణల నుంచి ఒప్పంద సేద్యం పంటలను మినహాయిస్తూ పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఈ ఆర్డినెన్స్‌ను అమల్లోకి తేవాలి. ఈ ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏ నిబంధనలు పెట్టినా అవి ఆ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఆమోదం పొందాలి.
కేవలం ఒక పంట సీజన్‌కే
ఇందులో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. రైతుతో వ్యాపారి లేదా కంపెనీ చేసుకునే ఒప్పంద కాలం కేవలం ఒక పంట సీజన్‌కే వర్తిస్తుంది. పాడి ఉత్పత్తులైతే ఒక ఉత్పత్తి వచ్చే కాలం వరకూ ఉంటుంది. గరిష్టంగా ఐదేళ్ల వరకు ఉంటుంది. వ్యవసాయోత్పత్తులంటే.. ఆహార ధాన్యాలు, నూనెగింజలు, పప్పుధాన్యాలు, పండ్లు, పత్తి, జనుము, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, చెరకు, కోళ్లు, పందులు, గొర్రెలు, చేపలు, పాడి ఉత్పత్తులు, పశుగ్రాసం, మనుషులు తినే అన్ని రకాల సహజ, శుద్ధి చేసిన ఉత్పత్తులన్నీ ఒప్పంద సేద్యం పరిధిలోకి వస్తాయి. వీటిని ఉత్పత్తి చేసే లేదా పండించే వారి నుంచి ఎంత ధరకు కొంటారో ముందుగా తెలుపుతూ కొనేవారు ఒప్పందం రాతపూర్వకంగా చేసుకోవాలి. దీనిని ఒప్పంద పత్రం అని పిలుస్తారు. వ్యవసాయ, ఉద్యాన పంటల నాణ్యత, ప్రమాణాలు, సరఫరా తదితర వివరాలన్నీ కూడా రాయాలి.
పేరు బదిలీ చేయడం
రైతు పంట సాగు చేసే భూమి అమ్మకం, లీజుకు ఇవ్వడం, పేరు బదిలీ చేయడం, ఈ పత్రం ఆధారంగా తాకట్టు పెట్టడం వంటి వ్యవహారాలేవీ ఈ ఒప్పందం కింద చేయడానికి వీలులేదు. ఈ ఒప్పందం ఆధారంగా పంట పండించడానికి లేదా పాడి, మత్స్య పరిశ్రమలు వంటివి ఏర్పాటకు శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదు. ఒకవేళ అలాంటివి నిర్మిస్తే తిరిగి పంట కాలం పూర్తైన తర్వాత అవి తొలగింపునకు కొనుగోలుదారు తప్పనిసరిగా అంగీకరించి పూర్వస్థితిలో భూమిని చదును చేసి యజమానికి అప్పగించాలి. కుదరని పక్షంలో అలా నిర్మాణాలు తొలగించకపోతే అవన్నీ కూడా ఒప్పందం ముగిసిన వెంటనే భూమి యజమానికి సొంతమవుతాయి.
పంటను రైతు అప్పగించిన వెంటనే
ఒప్పంద పత్రాలతో సాగు చేసే పంటలకు బ్యాంకులు ఇచ్చే పంట రుణాలు, పంటల బీమా పథకం వంటి ప్రభుత్వ పథకాలన్నీ వర్తిస్తాయి. విత్తన పంట కొనేవారు పంటను రైతుకు అప్పగించిన వెంటనే దాని విలువలో మూడింత రెండొంతులు-66 శాతం చెల్లించాలి. మిగిలిన సొమ్ము కూడా పంటను తీసుకున్న నెలలోగా ఇవ్వాలి. కౌలు రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా భూ యజమానులు ఇలాంటి ఒప్పందాలు చేసుకోకూడదు. ఒప్పంద పత్రం ఎలా ఉండాలనేది కేంద్రం నమూనా పత్రం విడుదల చేస్తుంది. ఈ ఒప్పందాలు నాణ్యమైన ఉత్పత్తులు పండించేందుకు దోహదపడేలా ఉండాలి. ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు లోబడి ఉండాలి. పంట సాగు పద్ధతులు, రసాయన అవశేషాలు లేకుండా పండించడానికి తీసుకోవాల్సిన చర్యలపై పత్రంలో రాయాలి. రైతు పొలం వద్ద నుంచే పంటను కొనుగోలుదారు తీసుకెళ్లాలి. తీసుకెళ్లడానికి ముందే నాణ్యతను కొనుగోలుదారుడు క్షుణ్ణంగా చూసుకోవాలి. కొనుగోలుదారులు రైతులకు సొమ్ము ఏ పద్ధతిలో చెల్లించాలనేది రాష్ట్రం మార్గదర్శకాలు ఇవ్వాలి. ఈ ఒప్పందాలను పరస్పర అంగీకారంతో ఎప్పుడైనా మార్చుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు.
ఎలా ఉండాలనేది రాష్ట్రమే
ఒప్పంద పత్రాల రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్ ద్వారా చేసేందుకు రాష్ట్రస్థాయి అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఇది ఎలా ఉండాలనేది రాష్ట్రమే నిర్ణయిస్తుంది. ఒప్పందాలపై తలెత్తే వివాదాల పరిష్కారానికి ఓ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. వివాదం తలెత్తితే తొలుత బోర్డుకు ఫిర్యాదు చేస్తే పరిష్కరించాలి. బోర్డు వద్ద పరిష్కారం కాకుండా పండించిన ప్రాంతంలోని రెవెన్యూ డివిజనల్ అధికారికి ఫిర్యాదు చేస్తే 30 రోజుల్లో పరిష్కరించాలి. ఆర్డీఓ ఇచ్చిన తీర్పు నచ్చకపోతే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలి. అక్కడా 30 రోజుల్లో తీర్పు చెప్పాలి. ఆర్డీఓ లేదా కలెక్టర్ ఇచ్చే తీర్పు సివిల్ కోర్టు తీర్పుతో సమానం. ఏ ఇతర కోర్టులు ఈ ఒప్పందాలపై జోక్యం చేసుకోరాదు.
ఈ కీలక ఒప్పందం ప్రకారం.. కొనుగోలుదారు రైతులకు నిర్దేశిత సొమ్ము చెల్లించడంలో ఏమైనా విఫలమైతే ఆ డబ్బుకు ఒకటిన్నర రెట్లు జరిమానా విధిస్తారు. ఒకవేళ ఏదైనా వివాదం ఏర్పడి రైతుకు వ్యతిరేకంగా తీర్పు వస్తే అతనికి కొనుగోలుదారు ఏమైనా సొమ్ము అడ్వాన్స్‌గా ఇచ్చి ఉంటే దానిని మాత్రమే రైతు వెనక్కి ఇస్తారు. అంతకుమించి రైతులను ఏమీ కూడా అడగరారు. ఒకవేళ ఈ ఆర్డినెన్స్‌కు ఏ సంబంధం లేని అంశాలతో వివాదం ఏర్పడితే రైతుల నుంచి ఏమీ వసూలు చేయరాదు.
ఇదీ చూడండి :ఎనిమిది ఆసుపత్రులు తిరిగిన గర్భిణి.. చివరికి!