ప్రతివాదులకు సకాలంలో నోటీసులు పంపకపోవడం.. కోర్టు విధులకు ఆటంకం కలిగించడమే అని హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద వ్యాఖ్యానించారు. ఈ విషయంలో.. రాష్ట్ర ఉన్నత న్యాయ స్థాన పరిధిలో పని చేస్తున్న రిజిస్ట్రీ సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించారు. హైకోర్టు సిబ్బంది అయినా.. ప్రభుత్వ అధికారులైనా... న్యాయమూర్తికి సమానమే అని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ హుందాతనాన్ని కాపాడం కోర్టు ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ వ్యాజ్యాల విచారణలో కోర్టుకు సహకారం అందిస్తానని అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ తమ వాదన వినిపించారు. న్యాయస్థానంతో పాటు కోర్టు ఆఫీసర్‌గా న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న రిజిస్ట్రార్ జ్యుడీషియల్ ఎ.గిరిధర్, రిజిస్ట్రార్ ఎన్.మురళీధర్‌రావు, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇతర సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. విచారణను ఫిబ్రవరి 5కి వాయిదా వేశారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయని కారణంగా హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆ వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న అధికారులకు న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. న్యాయస్థానం ఆదేశించినా నిర్దిష్ట సమయంలో హైకోర్టు రిజిస్ట్రీ.. నోటీసులు పంపలేదన్న కారణంతో న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. సుమోటో కోర్టు ధిక్కరణగా పరిగణించి విచారణ జరిపారు.