ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ప్రభుత్వ భూములను విక్రయిస్తే బాధ్యులైన అధికారులపై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలను ప్రారంభిస్తామని హైకోర్టు హెచ్చరించింది. ప్రభుత్వ భూముల అమ్మకం విషయంలో వేలం ప్రక్రియను కొనసాగించుకోవచ్చని...టెండర్లను ఖరారు చేయవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. ప్రభుత్వం హైకోర్టులో నేరుగా కౌంటర్ దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. విచారణను డిసెంబర్ 4కు వాయిదా వేసింది. న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ డి. రమేశ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు బుధవారం ఆదేశాలిచ్చింది.
మిషన్ బిల్డ్ ఏపీ పథకం ద్వారా విశాఖ, గుంటూరు జిల్లాలోని 9 ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఈ-వేలం ద్వారా విక్రయించే ప్రయత్నాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు గతంలో దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చాయి. కోర్టులో విచారణ సాగుతుండగానే మరికొన్ని ప్రభుత్వ స్థలాల విక్రయానికి అధికారులు తాజాగా ప్రకటన ఇచ్చారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. కొత్తగా చేపట్టిన ఆస్తుల విక్రయంపై తాజాగా వ్యాజ్యాలు దాఖలు చేసుకోవచ్చని ధర్మాసనం సూచించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించి భూములను విక్రయిస్తే అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని తేల్చి చెప్పింది.