ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Compensation must: 'కరెంట్​ వైర్లు తాకి మరణిస్తే పరిహారం చెల్లించాల్సిందే' - రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ తాజా తీర్పు

కరెంట్ షాక్‌తో ఎవరైనా మృతి చెందితే పరిహారం చెల్లించాల్సిందేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ స్పష్టం చేసింది. వర్షాలు పడి వైర్లు తెగిపోతే ఎవరికేమైనా తమకు బాధ్యత లేదని విద్యుత్‌ సంస్థలు భావించడం సరికాదని కమిషన్​ పేర్కొంది. 2016లో విజయనగరం జిల్లాలో కరెంటు తీగలు తగిలి చనిపోయిన సత్యనారాయణకు రూ. 6.88 లక్షల పరిహారం చెల్లించాలని విద్యుత్ సంస్థను ఆదేశించింది.

Compensation Compulsory for Current Shock death
వైర్లు తాకి మరణిస్తే పరిహారం చెల్లించాల్సిందే

By

Published : Aug 22, 2021, 9:47 AM IST

వర్షాలు పడి వైర్లు తెగిపోతే ఎవరికి ఏమైనా తమ బాధ్యత లేదని విద్యుత్‌ సంస్థలు భావించడం కుదరదని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ స్పష్టం చేసింది. విద్యుత్‌ షాక్‌తో సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పాచలవలస నివాసి జి.సత్యనారాయణ(29) 2016లో రాత్రి వేళ ఇంటికి వెళ్తుండగా రహదారిపై తెగి పడి ఉన్న విద్యుత్‌ వైరు తగిలి గాయాలపాలై ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మరణించారు. బురిజివలస పోలీసులు కేసు నమోదు చేశారు. కూలీ పనులకెళ్లే సత్యనారాయణపై భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఆధారపడ్డారు. విద్యుత్‌ శాఖ (ఏపీఈపీడీసీఎల్‌) నిర్లక్ష్యం వల్లే సత్యనారాయణ చనిపోయారని, పోషించే వ్యక్తిని కోల్పోయామని, పరిహారం చెల్లించాలని బాధిత కుటుంబం విద్యుత్‌ శాఖకు లీగల్‌ నోటీసులు పంపింది. వాటికి విద్యుత్‌ శాఖ స్పందించలేదు.

దీంతో విజయనగరం జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. ‘సంఘటన జరిగిననాడు పెద్ద వాన కురిసింది. ఊళ్లో వినాయక నిమజ్జన ఊరేగింపు జరుగుతోంది. వాన వల్ల తెగిపడిన విద్యుత్‌ వైరును ట్రాక్టరులో అక్కడికొచ్చిన సత్యనారాయణ నిర్లక్ష్యంగా పట్టుకున్నారు. దీంతో ఆయన చనిపోయారు. దీంట్లో మా నిర్లక్ష్యమేమీ లేదు’ అని విద్యుత్‌ సంస్థ వాదించింది. సాక్ష్యాధారాలు పరిశీలించిన జిల్లా కమిషన్‌ విద్యుత్‌ సంస్థ తరఫున సేవాలోపం ఉందని నిర్ధారించింది. బాధిత కుటుంబానికి రూ.6.88 లక్షలు పరిహారమివ్వాలని ఆదేశించింది. ఈ తీర్పును విద్యుత్‌ సంస్థ రాష్ట్ర కమిషన్‌లో సవాలు చేసింది. వాదనలు విన్న రాష్ట్ర కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ టి.సునీల్‌చౌదరి, సభ్యుడు పి.ముత్యాలనాయుడు కూడా జిల్లా కమిషన్‌ తీర్పునే సమర్థించారు. ఈ సంఘటనలో విద్యుత్‌ సంస్థ నిర్లక్ష్యం కనిపిస్తోందని, షాక్‌తో ఎవరైనా మృతి చెందితే పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details