Amaravati development: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వేల మంది కార్మికులు... నిత్యం పని చేసే కాంక్రీట్ యంత్రాలు... ఇలా రద్దీగా ఉండే విజయవాడ నగరం... ఇవన్నీ చూసి మూడేళ్లు అవుతోంది. మూడు రాజధానులు తెరమీదకు వచ్చిన తర్వాత భవన నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బహుళ అంతస్తుల నిర్మాణాలు ఆగిపోయాయి. కార్మికులు తిరుగుబాట పట్టారు. కంపెనీలు తరలివెళ్లడంతో టులెట్ బోర్డులు ఎక్కువయ్యాయి. 807 రోజుల అమరావతి రైతుల పోరాటం హైకోర్టు తీర్పుతో ఫలించింది. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ నిర్మాణం చేయాలని, భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన నివేశన స్థలాలు అప్పగించాలని హైకోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మరోసారి నగర పరిసర ప్రాంతాల అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి.
అభివృద్ధి ఉరకలు పెట్టింది...
Amaravati development: గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత ఈ ప్రాంతంలో అభివృద్ధి ఉరకలు పెట్టింది. విజయవాడ, మంగళగిరి, తుళ్లూరు ప్రాంతాల్లో నిర్మాణరంగం ఒక్కసారిగా ప్రభవించింది. విజయవాడ మెట్రో ప్రాజెక్టు, అమరావతి బాహ్య వలయ రహదారి, కృష్ణా నదిపై వంతెనల నిర్మాణం.. బైపాస్ రహదారులు ఇలా ఎన్నో ప్రణాళికలు రూపొందాయి. సీఆర్డీఏ ఆధ్వర్యంలో విజవయవాడ నగరంలోనే ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మెట్రో ప్రాజెక్టు దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. వలయ రైళ్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. జెట్ సిటీ, సిటీస్క్వేర్ కాంప్లెక్సు, రాజీవ్‌గాంధీ పార్కు రీడెవలప్‌మెంట్, నక్షత్ర హోటళ్ల నిర్మాణం, జలక్రీడల ప్రాజెక్టులు ఇలా ఎన్నో ఊపిరిపోసుకున్నాయి.
ఎక్కడివక్కడ నిలిచిపోయాయి...
Amaravati development: సీఆర్‌డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఆధ్వర్యంలో పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ప్రభుత్వం 2019లో మారిన తర్వాత ఎక్కడి వక్కడే నిలిచిపోయాయి. రాజధాని గ్రామాల్లో నిర్మాణం ఆగిపోయింది. రహదారుల నిర్మాణం నిలిచిపోయింది. విజయవాడ బైపాస్ నిర్మాణంలో నాలుగో ప్యాకేజీలో భాగంగా నిర్మించే ఐకాన్ వంతెనకు మంగళం పాడారు. సాదాసీదా వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అంతకుముందు ఎల్‌అండ్‌టీతో పాటు పలు సంస్థలు ఇచ్చిన ఆకృతులు మూలనపడ్డాయి. నిర్మాణాలు నిలిచిపోవడంతో ఇక్కడి నుంచి సంస్థలు బిచాణా ఎత్తేశాయి. ఉద్యోగులు, కార్మికులు వెళ్లిపోయారు. రాజధానిలోని పలు విద్యా సంస్థలకు నిస్తేజం అలముకుంది.