ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

construction things cost : ఇంటి నిర్మాణంపై ధరల దరువు - construction-things-cost-increased in andhrapradhesh

సొంతింటి కల రోజురోజుకీ ఖరీదయిపోతోంది. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న ధరలతో బడ్జెట్‌ తల్లకిందులవుతోంది.  ఇసుక నుంచి ఉక్కు దాకా.. సిమెంటు నుంచి ఎలక్ట్రికల్‌ సామగ్రి వరకు ధరలన్నీ నెల రోజుల్లోనే 15 నుంచి 30 శాతం పెరగడం ఇళ్లు కట్టేవారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.

ఇంటి నిర్మాణంపై ధరల దరువు
ఇంటి నిర్మాణంపై ధరల దరువు

By

Published : Oct 30, 2021, 5:54 AM IST

ఉక్కు ధర నెల రోజుల వ్యవధిలోనే టన్నుకి రూ.10 వేల వరకు పెరిగింది. రెండు, మూడు నెలల వ్యవధిలో సిమెంట్‌ ధర బస్తాకి రూ.50-60 పెరిగింది. ఎలక్ట్రిక్‌, ప్లంబింగ్‌ సామగ్రి, రంగులు తదితరాల ధరలూ 20-30% వరకు పెరిగాయి. ఇసుక సైతం భారంగా మారింది. రాష్ట్రంలో భారీ నిర్మాణ, వాణిజ్య ప్రాజెక్టులు చేస్తున్న బిల్డర్లతోపాటు సొంతానికో చిన్న గూడు కట్టుకోవాలనే సామాన్యులకూ ఇది శరాఘాతంగా మారింది. ప్రస్తుతం నిర్మాణ వ్యయం చ.అడుగుకి రూ.200 నుంచి రూ.300 వరకు పెరిగినట్లు నిర్మాణరంగ ప్రతినిధులు చెబుతున్నారు. ఉక్కు ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. టన్నుకు రూ.70 వేలు దాటేసింది. విశాఖ ఉక్కు ఉత్పత్తి చేసే 8ఎం.ఎం. ఉక్కు చువ్వల ధర నిరుటి నవంబరులో విజయవాడ మార్కెట్‌లో రూ.49,800 ఉంది. ఈఏడాది సెప్టెంబరులో రూ.62 వేల వరకు పలికింది. ప్రస్తుతం రూ.72 వేలకు చేరింది. సింహాద్రి టీఎంటీ సంస్థ ఉత్పత్తి చేసే 8ఎం.ఎం. చువ్వల ధర విజయవాడలో గత ఏడాది నవంబరులో రూ.45,800 ఉంటే, ప్రస్తుతం రూ.69 వేలకు చేరింది.

సిమెంటు మరింత ప్రియం

రెండు, మూడు నెలల్లో సిమెంటు మోయలేనంత భారమైంది. 50 కిలోల బస్తా ధర బ్రాండ్‌, నాణ్యతల్నిబట్టి రూ.40-60 వరకు పెరిగింది. నిరుడు ప్రీమియం బ్రాండ్ల బస్తాకు రూ.300, మీడియం బ్రాండ్ల బస్తాకు రూ.230 వరకుఉండేది. ఇప్పుడు ప్రీమియం బ్రాండ్ల ధర రూ.400, మీడియం బ్రాండ్ల బస్తా ధర రూ.320 వరకు ఉంది.

ఇసుక సంగతి సరేసరి

రాష్ట్రంలో చాలాచోట్ల స్టాక్‌ పాయింట్లలోనే ఇసుక దొరుకుతోంది. వర్షాలతో రీచ్‌లకు వెళ్లే సౌలభ్యం లేదు. రీచ్‌లలో టన్ను ఇసుక ధర రూ.475 కాగా... స్టాక్‌పాయింట్లలో అదనంగా (రీచ్‌ల నుంచి తేవడానికయ్యే రవాణా ఛార్జీలను కలిపి) వసూలు చేస్తున్నారు. దూరాన్ని బట్టి కూడా ధర మారుతోంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో టన్ను రూ.650, కీసరలో రూ.670, నూజివీడులో రూ.710కి విక్రయిస్తున్నారు. విజయవాడకు తెచ్చేసరికి టన్ను ధర రూ.1,000-1,100కు చేరుతోంది. విశాఖకు శ్రీకాకుళం, రాజమహేంద్రవరం నుంచి ఇసుక తెచ్చుకోవాల్సి రావడంతో టన్నుకి రూ.1550కి పైనే అవుతోంది.

తోడైన బొగ్గు, పెట్రో మంట

ముడిసరకుల ధరలు పెరగడంతోనే నిర్మాణ సామగ్రి ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయని వాటి ఉత్పత్తిదారులు చెబుతున్నారు. బొగ్గు ధరల కారణంగా ఉక్కు ఉత్పత్తి వ్యయం పెరిగిందని, డీజిల్‌, పెట్రోల్‌ ధరల ప్రభావంతో... రవాణా ఛార్జీల రూపంలో అదనపు భారం పడుతోందన్నారు. ‘‘బొగ్గు(కోకింగ్‌ కోల్‌) ధర మరీ అనూహ్యంగా పెరిగింది. ఒకప్పుడు టన్ను రూ.4 వేలు ఉండేది. ఇప్పుడు రూ.16 వేలు దాటిపోయింది. ఇనుప ఖనిజం మండుతోంది. ఎన్‌ఎండీసీ వద్ద టన్ను ఇనుప ఖనిజం బేసిక్‌ ధర రూ.8 వేల వరకు ఉంది. ఉక్కు ఉత్పత్తిలో ఉపయోగించే ఫెర్రో అల్లాయ్స్‌ ధరలూ పెరిగాయి’’ అని స్టీల్‌ ఎక్స్ఛేంజ్‌ ఇండియా లిమిటెడ్‌ (సింహాద్రి టీఎంటీ) డైరెక్టర్‌ వి.వి.కృష్ణారావు తెలిపారు.

అది ఒక సాకు మాత్రమే

ముడి సరకుల ధరల కారణంగానే నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయన్నది ఉత్పత్తిదారులు చెబుతున్న వంక మాత్రమే. పరిస్థితుల్ని అనువుగా మార్చుకుని, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని ధరల్ని అదుపు చేయాలి. ధరలు పెరగడం ప్రైవేటు నిర్మాణ రంగానికే కాదు, ప్రభుత్వాలకూ భారమే. ప్రభుత్వాలు చేపట్టే నిర్మాణ ప్రాజెక్టులు, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టుల వ్యయమూ గణనీయంగా పెరుగుతోంది.

-రాజా శ్రీనివాస్‌, క్రెడాయ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details