నగరాలు, పట్టణాల్లో కొత్త భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు ఆన్‌లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టం అమలులో ఉన్నా.. అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. ప్లాన్ కాపీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినప్పటి నుంచే ముడుపులపర్వం మొదలవుతోంది. నగరాల్లో వార్డు ప్లానింగ్ కార్యదర్శుల నుంచి సహాయ పట్టణ ప్రణాళికాధికారి వరకు, పట్టణాల్లో ప్లానింగ్ కార్యదర్శి నుంచి బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ల వరకు వారు అడిగినన్ని డబ్బులిస్తే తప్ప ప్లాను అనుమతి దరఖాస్తులు ముందుకు కదలడం లేదు. అనిశా అధికారులు ఈనెల 3 నుంచి 5వ తేదీ మధ్య పలు నగరాలు, పట్టణాల్లో చేసిన క్షేత్రస్థాయి తనిఖీల్లో అత్యధిక భవన నిర్మాణాల్లో ఉల్లంఘనలు వెలుగుచూశాయి. ప్లానుకు విరుద్ధంగా అదనపు అంతస్తుల నిర్మాణం, సెట్‌బ్యాక్ వదలకపోవడం, పార్కింగ్ స్థలంలోనూ గదులు నిర్మించడం వంటి అక్రమాలు బయటపడ్డాయి. భవన నిర్మాణ ప్రాంతంలో రోడ్డు వెడల్పు తగినంత లేకపోయినా అనుమతులిచ్చినట్లు తేల్చారు. వార్డు సచివాలయాల్లో కొందరు ప్లానింగ్ కార్యదర్శులు కొత్త నిర్మాణాలకు అనుమతులిచ్చేందుకు లంచాలకు పాల్పడుతున్నారు. వీరికి అక్కడి బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు తోడవుతున్నారు. దరఖాస్తుదారు ఆన్‌లైన్‌లో ప్లాను అప్‌లోడ్ చేసిన వెంటనే ప్లానింగ్ కార్యదర్శి లాగిన్‌కు వెళుతుంది. అక్కడి నుంచి బేరాలు మొదలవుతున్నాయి. ప్రత్యేకించి 200-250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే జీ+3, జీ+4 భవనాలకు అనుమతుల విషయంలో ఎక్కువగా వసూళ్లు చేస్తున్నారు. కనిష్ఠంగా రూ.లక్ష, గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు తీసుకుంటున్నారు. కొందరు వార్డు ప్లానింగ్ కార్యదర్శులు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు కలిసి చేస్తున్న అక్రమ వసూళ్లలో పై అధికారులకూ వాటాలు అందుతున్నాయని తనిఖీల్లో గుర్తించారు. కొన్నిచోట్ల కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పాత్రా ఉంటోంది. ఆన్‌లైన్‌లో ప్లాను అర్జీ రాగానే, సంబంధిత ప్లానింగ్ కార్యదర్శులు స్థానిక ప్రజాప్రతినిధులను కలవాలని దరఖాస్తుదారులకు సూచిస్తున్నారు. అధికారులు, నేతలు కలిసి అర్జీదారుల నుంచి డబ్బులు లాగుతున్న ఉదంతాలు పలుచోట్ల చోటుచేసుకున్నాయి.
అనుమతులు లేకుండా అదనపు అంతస్తుల నిర్మాణం
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోన్ పరిధిలో పట్టణ ప్రణాళిక అధికారుల అండతో ఓ వ్యక్తి ప్లానుకు విరుద్ధంగా అదనపు అంతస్తు నిర్మించాడు. జీ ప్లస్ త్రీకి అనుమతులు తీసుకోగా, ఇప్పుడక్కడ జీ ప్లస్ ఫోర్ భవనం కన్పిస్తోంది.తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పరిధిలో ఒకరు నిర్మించిన భవనానికి నిబంధనల ప్రకారం సెట్‌బ్యాక్, పార్కింగ్ స్థలం విడిచిపెట్టలేదు. భవన నిర్మాణ సమయంలో పట్టణ ప్రణాళిక అధికారులు చూసీ.. చూడనట్లుగా వదిలేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ వ్యక్తి ప్లానుకు విరుద్ధంగా భవనానికి నాలుగు వైపులా ఖాళీ స్థలం (సెట్ బ్యాక్) విడిచిపెట్టనప్పటికీ పట్టించుకోలేదు. ఈనెల 3 నుంచి 5వ తేదీ మధ్య అవినీతి నిరోధక శాఖ (అనిశా-ఏసీబీ) అధికారులు రాష్ట్రంలోని వివిధ పుర, నగరపాలక సంస్థల్లో చేపట్టిన తనిఖీల్లో ప్రాథమికంగా గుర్తించిన అక్రమాలివి.
అనుమతులు లేకుండా అదనపు అంతస్తుల నిర్మాణం