నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగిన కారణంగా.. నిర్మాణ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కరోనాతో పూర్తిగా స్తంభించి.. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న నిర్మాణ రంగాన్ని ఈ పరిణామాలు కుంగదీస్తున్నాయి. ఈ భారం వినియోగదారులపైనే పడటంతో.. చాలామంది సొంతింటి కలను వాయిదా వేసుకుంటున్నారు. ఉక్కు, సిమెంటు, ఇసుక, వైరింగ్ సామగ్రి ధరలు పెరగడంతో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.200 వరకు పెరిగిందని భవన నిర్మాణదారులు చెబుతున్నారు.
సిమెంటుదీ అదే దారి:రెండు మూడు నెలల్లో సిమెంటు ధరలూ భారీగా పెరిగాయి. ప్రముఖ బ్రాండ్ల సిమెంటు ధర గతంలో బస్తా (50 కిలోలు) రూ.300 ఉంటే ఇప్పుడు రూ.400కి చేరింది. మీడియం బ్రాండ్లయితే రూ.230 నుంచి రూ.300కి చేరింది. సిమెంటు ఉత్పత్తిదారులు కలసి ధరలు పెంచేయడం, ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే ఈ పరిస్థితులకు కారణమని నిర్మాణరంగ వర్గాలు ఆరోపిస్తున్నాయి. గతంలో సిమెంటు ధరలు పెరిగినప్పుడు... ప్రభుత్వం జోక్యం చేసుకునేది.
ఇసుక.. చెప్పాల్సిన పనే లేదు:ఇసుక సమస్య ఎప్పటినుంచో తీరడం లేదు. గతంలో రూ.6వేలకు వచ్చే 18 టన్నుల ఇసుక ఇప్పుడు రూ.17 వేలకు చేరింది. అదీ తగినంత.. కావల్సినప్పుడు దొరకడం లేదని విజయవాడలోని పోరంకి ప్రాంతానికి చెందిన ఒక బిల్డర్ పేర్కొన్నారు. ఉక్కు, సిమెంటు, ఇసుకతో పాటు, వైరింగ్ సామగ్రి, సీవీసీ, సీపీవీసీ ధరలూ 20 శాతం వరకు పెరిగాయని ఆయన తెలిపారు.
రెండు నెలల్లో రూ.20 వేలు
ఉక్కు ధరలు గత 15 ఏళ్లలో కనీవినీ ఎరగని రీతిలో పెరుగుతున్నాయి. జులై నుంచి ఇప్పటికి 55 శాతం పెరిగాయి. విశాఖ ఉక్కు ఉత్పత్తి చేసే 8 ఎం.ఎం. రాడ్‌ల ధర విజయవాడ మార్కెట్‌లో టన్ను రూ.70 వేలకు చేరింది. అదే ఉక్కు ధర గత నవంబరు 15న రూ.49,800 ఉంది. స్టీల్ ఎక్స్ఛేంజి ఇండియా లిమిటెడ్ (సింహాద్రి టీఎంటీ) సంస్థ ఉత్పత్తి చేసే 8 ఎం.ఎం. చువ్వల ధర విజయవాడ మార్కెట్‌లో నవంబరు 15న రూ.45,800 ఉంటే, గురువారం రూ.64,500కు చేరింది. అంతర్జాతీయ పరిణామాలే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
* కరోనాతో నిర్మాణరంగం తీవ్రంగా దెబ్బతింది. ఇళ్లు కొనేవారిలో చాలామంది ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడిప్పుడే మళ్లీ ముందుకొస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతున్న దశలో నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం ఈ రంగాన్ని దెబ్బతీస్తోంది.
* చిన్న చిన్న ప్రాజెక్టులు చేపట్టినవారు.. పెరిగిన వ్యయాన్ని భరించలేక వాటిని ఆపేస్తున్నారు. ఫలానా సమయానికి ఫ్లాట్లు కట్టి ఇస్తామని చెప్పి, అడ్వాన్సులు తీసుకున్నవారు తప్పనిసరై కొనసాగిస్తున్నారు.
* ఒక చదరపు అడుగు నిర్మాణానికి 2.75 కిలోల నుంచి 3 కిలోల వరకు ఉక్కు అవసరం. 50 ఫ్లాట్ల అపార్ట్‌మెంట్ నిర్మాణానికి సుమారు 10 వేల బస్తాల సిమెంటు అవసరమవుతుందని అంచనా.
* నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో ప్రాజెక్టుల్లో పెట్టుబడులు నిలిచిపోతాయని, ఇల్లు కొనాలనుకున్నవారు ఇంకా ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తారని నిర్మాణరంగ వర్గాలు చెబుతున్నాయి.