Murder Plan to Kill TRS Minister : తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్రకోణంలో తవ్వేకొద్దీ చాలా విషయాలు తెలుస్తున్నాయి. మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు 2017లో ఆధార్ నమోదుకు సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. కొద్దికాలం వ్యాపారం సజావుగా సాగినా.. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ సోదరుడి నుంచి ఒత్తిడి మొదలైంది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి సహకారం కరవైంది. నష్టపోయిన రాఘవేంద్రరాజు బార్ ప్రారంభించాడు. దీనికి మంత్రి అనుచరుడు మహ్మద్ ఫరూఖ్ అనేక ఆటంకాలు కలిగించడంతో మూతపడింది. ఈ మొత్తం వ్యవహారంలో రాఘవేంద్రరాజు ఆరు కోట్ల రూపాయలు నష్టపోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఇవి క్రమంగా వివాదాలకు దారితీశాయి. పరస్పరం కేసులు పెట్టుకున్నారు.
కుట్ర బయటపడుతుందనే భయంతో..
Conspiracy to Kill TRS Minister : ఈ నేపథ్యంలోనే మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేసేందుకు రాఘవేంద్రరాజు కుట్రపన్నాడు. అమరేంద్రరాజుతో కలిసి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌తో మాట్లాడి సహకరించాలని కోరాడు. ముగ్గురూ కలసి హత్యచేసినా, సుపారీ ముఠాలతో చేయించినా రూ.15 కోట్లు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారు. ఇదే విషయాన్ని నాగరాజు గతేడాది డిసెంబరు 18న మహబూబ్‌నగర్ ఎక్సైజ్ న్యాయస్థానానికి హాజరైన మహ్మద్ ఫరూఖ్‌తో చర్చించాడు. ఫరూఖ్ తన స్నేహితుడు హైదర్ అలీకి చెప్పాడు. మంత్రి హత్య కుట్ర కోణం బట్టబయలవుతుందనే ఉద్దేశంతో నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్ భయపడ్డారు. ఫరూఖ్, హైదర్ అలీని హత్య చేసేందుకు సిద్ధమయ్యారు. కొంపల్లి సుచిత్ర వద్ద టీ తాగేందుకు వారు రాగా మారణాయుధాలతో వెంటపడ్డారు. తప్పించుకున్న బాధితులు పేట్‌బషీర్‌బాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి అదేరోజు సాయంత్రం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.