కృష్ణా జిల్లాలో..
విజయవాడలో ఎపీసీసీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు మస్తాన్ వలి పెరిగిన పెట్రో ధరలపై ఆందోళన చేపట్టారు. మోదీ, జగన్‌లు కలిసి ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నారని.. కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని స్థితిలో మోదీ ఉన్నారని మండిపడ్డారు. ఇంధన ధరలపై నాడు గొంతెత్తిన జగన్.. నేడు మోదీని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఆయిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లాలో..
కరోనా కంటే ప్రమాదకరంగా దేశ ప్రధాని మోదీ తయారయ్యారని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి చిలక విజయ్ కుమార్ తాడికొండలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2014లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 10,709 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోలు లీటరు రూ. 71.41, డీజిల్ లీటరు రూ. 55.49 ఉండేదని దానిపై సుంకాలు మెుత్తం కేవలం రూ. 12.66 గా ఉండేవన్నారు. 2020 నుంచి అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పతనమై బ్యారెల్ 3,463 డాలర్లకు చేరుకోగా.. పెట్రోల్ ధర రూ. 83.17 నుంచి రూ. 102కు, డీజల్ ధర రూ. 73.21 నుంచి రూ. 100 చేరుకుందని ఎక్సైజ్ సుంకం పెట్రోలుపై రూ. 32.99 ఉండగా డీజిల్‌పై రూ. 31.83 భారం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా వంట గ్యాస్ విషయంలోనూ ధరలు అధికమయ్యాయన్నారు. సీఎంలను కేసుల పేరుతో బెదిరించి రాజ్యాంగపరమైన సంస్థలను నీరుగారుస్తున్నారని ఆరోపించారు.
కడప జిల్లాలో..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లనే పెట్రోల్ ధరలు రూ. 100కు చేరాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శైలజానాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డిలు ఆరోపించారు. కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు వద్ద వారు పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలియజేశారు. పెట్రోల్ పై రాష్ట్రం, క్రేంద్రాలు వేరువేరుగా శుంకాలు విధించడమే అధిక ధరలకు కారణమని ఆరోపించారు. ఇంధన ధరలు పెరుగుదల నెపంతో దేశ ప్రజల నుంచి ఇప్పటికే రూ. 14 లక్షల కోట్లు వసూలు చేశారని మండిపడ్డారు. పక్కరాష్ట్రాల్లో ధరలు తగ్గిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం పెంచడం దారుణమన్నారు.
చిత్తూరు జిల్లాలో..
నగిరిలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బి.వి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓం శక్తి గుడి నుంచి పట్టణంలోని టవర్ క్లాక్ వరకు పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. కరోనా దృష్ట్యా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాకేశ్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసరాల సరుకులను పంపిణీ చేశారు.
దేశంలో అరాచక పాలన, ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే ఏపీసీసీ ఉపాధ్యక్షుడు షాజహాన్ బాషా విమర్శించారు. మదనపల్లిలో పెరిగిన గ్యాస్, పెట్రోల్, నిత్యావసర ధరలపై ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇలాంటి పరిపాలన దేశంలో ఎన్నడూ గతంలో చూడలేదని అన్నారు.