ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TS CONGRESS: హుజూరాబాద్​ ఉపపోరుపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి

తెలంగాణలోని హుజూరాబాద్ ఉపఎన్నిక వ్యూహాలు ఖరారు చేయడంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. చలో రాజ్ భవన్ కార్యక్రమం విజయవంతం కావడంతో మరో పోరాటానికి సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణ కమిటీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో టీపీసీసీ సుదీర్ఘంగా చర్చించి కార్యాచరణ సిద్ధం చేసింది.

By

Published : Jul 18, 2021, 12:37 PM IST

TS CONGRESS
TS CONGRESS

హుజూరాబాద్​ ఉపపోరుపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారధ్యంలో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. చలో రాజ్ భవన్ కార్యక్రమం పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువ విజయవంతం కావడంతో కాంగ్రెస్​లో ఉత్సాహం రెట్టింపు అయింది. దీంతో ఇదే వేగంతో ముందుకెళ్లేందుకు హస్తం నేతలు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

48గంటల దీక్ష..

టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గం శనివారం ఇందిరా భవన్​లో సమావేశమైంది. హుజూరాబాద్ ఉపఎన్నికలు, అభ్యర్థి ఎంపిక, నిరుద్యోగ సమస్య, జల వివాదాలపై కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాలపై చర్చించింది. మొదట విశ్వవిద్యాలయాల్లో పర్యటించి అక్కడ విద్యార్థి సంఘాల ప్రతినిధులతో సమావేశమై ఓ సమగ్ర నివేదిక తయారు చేయనుంది. అనంతరం నిరుద్యోగ సమస్యపై 48 గంటల దీక్ష చేయాలని పీసీసీ నిర్ణయం తీసుకుంది. జల వివాదంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని,. ఇందుకోసం నిపుణులతో కూడిన కమిటీ వేయాలని పీసీసీ కార్యవర్గం నిర్ణయించింది.

హుజూరాబాద్​లో జెండా పండుగ

ఇక హుజూరాబాద్ ఉపఎన్నికల కోసం నియమించిన ఇంఛార్జీలతో, స్థానిక నేతలతో పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల వ్యూహంపై చర్చించడంతో పాటు అభ్యర్థి ఎంపిక కోసం అభిప్రాయాలు తెలుసుకున్నారు. స్థానిక నాయకులు, మండల, నియోజకవర్గ ఇంఛార్జీలు జనంలో నిత్యం ఉండేట్లు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. స్థానిక నాయకులతో కలిసి మండల స్థాయి సమావేశాలు వారం, పది రోజుల్లో నిర్వహించాలని సూచించారు. ఇటీవల కౌశిక్ రెడ్డి పార్టీ వీడిన నేపథ్యంలో ఆయన వెంట ఎవరూ వెళ్లకుండా మండలాల వారిగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్​ నేతలు నిర్ణయించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూరాబాద్​లో వచ్చే నెల 15 నుంచి సెప్టెంబర్ 17వరకు 40రోజుల పాటు జెండా పండుగ చేయాలని పీసీసీ కార్యవర్గంలో తీర్మానం చేశారు. పార్టీ వీడిన వారిని తిరిగి చేర్చుకోవడానికి ఒక కమిటీ వేసి ఆ నివేదిక మేరకే నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

పోడుభూములపై పోరాటం

పోడు భూములపై పార్టీ పరంగా పోరాటానికి ఓ కమిటీ వేయాలని కార్యవర్గం తీర్మానం చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేయాలని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ల నిర్ణయానికి కాలపరిమితి ఉండేలా పోరాటం చేయనున్నారు. ఇక భూముల వేలంలో భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్​ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చిన భూములు కూడా అమ్ముతున్నారని కాంగ్రెస్ విమర్శలు చేసింది. దానిపై విచారణ కోసం మహేష్ కుమార్​ గౌడ్ నేతృత్వంలో కమిటీ వేశారు. క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని నిర్ణయించారు. వచ్చే నెల చివరిలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, మండల, బ్లాక్ స్థాయి కాంగ్రెస్ అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నారు.

మొత్తానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి:petrol rate hikes: రాష్ట్రంలో అక్కడే ఎక్కువ పెట్రోల్ ధర..ఎంతంటే!

ABOUT THE AUTHOR

...view details