ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ విషయం కచ్చితంగా గుర్తుంచుకోండి. ఏ వ్యక్తైతే తెలంగాణను మోసం చేశాడో, ఏ వ్యక్తైతే లూటీ చేశాడో, తెలంగాణ ఆకాంక్షలను దెబ్బతీశాడో ఆయనతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఉండబోదు. దీని తర్వాత కూడా ఎవరైనా ఇదే ప్రశ్న అడిగితే వారిని కాంగ్రెస్ నుంచి బహిష్కరిస్తాం. ఎవరైనా, ఎంతటివారైనా ఊపేక్షించేది లేదు. పొత్తు కోరుకునే కాంగ్రెస్ నేతలు.. తెరాస లేదా భాజపాలోకి వెళ్లవచ్చు. మేము రాజుతో పొత్తు పెట్టుకోం. ఇది కాంగ్రెస్-తెరాస మధ్య పోరాటం... ఆ పార్టీని ఎన్నికల్లో ఓడిస్తాం. - రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
వారి మధ్య దోస్తీ: ఓవైపు తెరాసపై ఘాటు విమర్శలు చేస్తూనే భాజపాపైనా రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెరాస-భాజపా మధ్య దోస్తీ నడుస్తోందని ఆరోపించారు. తెలంగాణలో ప్రత్యక్షంగా గెలవలేని భాజపా... రిమోట్ కంట్రోల్‌లాంటి తెరాస సర్కార్ ఉండాలని భావిస్తోందని విమర్శించారు.
పొత్తు ఉందంటే అది తెరాస-భాజపా మధ్యే. నరేంద్రమోదీ మూడు నల్లచట్టాలను పార్లమెంటులో ఆమోదించుకుంటే తెరాస నేతలు ఏం చెప్పారు? తెలంగాణను నేరుగా పాలించలేమని భాజపాకు తెలుసు. అందుకే వారికి రిమోట్ కంట్రోల్ అవసరం. భాజపాతో కాంగ్రెస్ ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోబోదని వారికి తెలుసు. అందుకోసమే తెలంగాణలో తెరాస సర్కార్ ఉండాలని భావిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎంత దోపిడీ చేసినా ఆయనపై ఈడీ, సీబీఐ ప్రయోగించకపోవడమే ఇందుకు సాక్ష్యం. - రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
రాచరిక పాలన: తెరాస సర్కార్‌పైనా రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణను ఒక వ్యక్తి, ఒక కుటుంబం కోసం ఏర్పాటు చేయలేదని చెప్పారు. రైతులు, ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించి తెలంగాణ రాష్ట్రం ఇస్తే... ప్రస్తుతం రాచరిక పాలన నడుస్తోందని ఆరోపించారు. 8ఏళ్లైనా ప్రజల ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని మండిపడ్డారు.
తెలంగాణ మొత్తం చూస్తే ఒక్క కుటుంబానికి మాత్రమే ప్రయోజనం కలిగింది. తెలంగాణ ప్రజలకు ఏం లబ్ధి కలిగిందని అడుగుతున్నాను. వితంతువులైన రైతుల భార్యలు ఇక్కడ రోదిస్తున్నారు. ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని భావించాం. ఐతే ఇక్కడ ప్రజల సర్కార్ రాలేదు. ఉన్నది ముఖ్యమంత్రి కాదు... రాజు. ముఖ్యమంత్రి ఐతే ప్రజల మాటలు వింటారు. రాజు మాత్రం జనంమాటకు బదులుగా మనస్సులో ఏది అనిపిస్తే అది చేసేస్తారు.