Rahul fires on trs govt: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తెరాస, కాంగ్రెస్ మధ్యే యుద్ధమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన రాహుల్... కేసీఆర్ వెనుక ధనం, పోలీసులు ఉన్నారు కానీ.. ప్రజలు లేరని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణను ఒక ఆదర్శంగా రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసేది నిరంకుశ ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. మెరిట్ ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని తెలిపారు. ప్రజలు, రైతుల పక్షాన పోరాటం చేసేవారికే టికెట్ ఇస్తామని చెప్పారు.
'' సీనియర్లు అయినా సరే పార్టీ కోసం పనిచేయకుంటే టికెట్ రాదు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరి గురించి సర్వే చేసి టికెట్లు కేటాయిస్తాం. వరంగల్ డిక్లరేషన్ గురించి ప్రతి వ్యక్తికీ, ప్రతి రైతుకీ తెలియజేయండి. వరంగల్ డిక్లరేషన్ గురించి చిన్నపిల్లలకు కూడా తెలియాలి. వరంగల్‌లో చెప్పింది డిక్లరేషన్ మాత్రమే కాదు.. ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య ఒప్పందం.'' - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
rahul gandhi on kcr: కుటుంబంలోని వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమన్న రాహుల్... తాను ప్రతి ఒక్కరి అభిప్రాయాలూ, ఆలోచనలూ వింటానని తెలిపారు. ఏదైనా ఉంటే నాలుగు గోడల మధ్య మాట్లాడుకుందాం కానీ.. మీడియా ముందు మాత్రం చెప్పొద్దని వెల్లడించారు. నేతలందరి కృషి వల్ల వరంగల్ సభ దిగ్విజయం అయ్యిందన్నారు. అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. కాంగ్రెస్‌పై గౌరవమున్న కార్యకర్తలు కోట్ల మంది ఉన్నారని పేర్కొన్నారు.