కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నిక (Huzurabad By Election)అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌లో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నలుగురి పేర్లతో కూడిన జాబితా పీసీసీ.. పార్టీ హైకమాండ్‌కు పంపింది. అందులో మాజీమంత్రి కొండా సురేఖతోపాటు(konda sureka) మరో ముగ్గురి పేర్లు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
నేడు అభ్యర్థి ప్రకటన..
హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి పేరును కాంగ్రెస్ పార్టీ శుక్రవారం అధికారికంగా ఖరారు చేయనుంది(congress candidate to be announced on today). సీఎల్పీ కార్యాలయంలో గురువారం సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క(mallu batti vikramarka), పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహా, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు ఈ అంశంపై సుదీర్ఘ కసరత్తు చేశారు. మాజీ మంత్రి కొండా సురేఖ, కవ్వంపల్లి సత్యనారాయణ, రవికుమార్, కృష్ణారెడ్డి పేర్లను ఇప్పటికే ఏఐసీసీకి పంపారు. హుజూరాబాద్ అభ్యర్థి కోసం 19 దరఖాస్తులు వచ్చినట్టు రాజనర్సింహా వెల్లడించారు. సామాజిక వర్గాల వారీగా నలుగురి పేర్లతో నివేదిక తయారు చేసినట్టు వివరించిన రాజనర్సింహ.. భట్టి విక్రమార్కతో కలిసి పీసీసీకి నివేదించినట్టు తెలిపారు.
కొండ సురేఖ క్లారిటీ...
ఇప్పటికే పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఇచ్చిన నివేదికలో పేర్లున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నా.. మాజీమంత్రి కొండ సురేఖ, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణలు దరఖాస్తు చేసుకోకపోవడం విశేషం. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు వస్తున్న పుకార్లపై కొండా సురేఖ.. వరంగల్ జిల్లా లక్ష్మీపురంలో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో కుండ బద్దలు కొట్టారు. ఈ విషయమై అధిష్ఠానం నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. చర్చ జరిగింది మాత్రం వాస్తవమని చెప్పారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కొండా సురేఖ(Konda surekha) తెలిపారు.