congress campaign in munugode constituency: మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ప్రకటన కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో క్యాడర్ చేజారకుండా పీసీసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాజీవ్‌గాంధీ జయంతి రోజున పొర్లగడ్డ తండాలో పార్టీ పతాకాన్ని ఎగురవేసి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. భాజపా, తెరాస నేతలు క్షేత్రస్థాయిలో ఉంటూ వ్యూహాలు అమలు చేస్తుండడంతో దీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మండల ఇన్‌ఛార్జీలను నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
మన మునుగోడు - మన కాంగ్రెస్ అనే నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని తెలిపారు. స్థానిక నాయకులను కలుపుకొని జనంలోకి వెళ్లాలని.. భాజపా, తెరాస వైఖరిని ఎండగట్టాలని స్పష్టం చేశారు. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడారని, ఆర్థిక ఒప్పందంలో భాగంగానే భాజపాలో చేరారని జనంలోకి తీసుకెళ్లాలని పీసీసీ తెలిపింది. మండలాలు, పంచాయతీల వారీగా భాజపా, తెరాసలో చేరిన నేతలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించడం ద్వారా ఆయా పార్టీలపై వ్యతిరేకత పెంచాలని నిర్ణయించింది.