ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ విమోచన దినోత్సవానికి కాంగ్రెస్ భారీ కసరత్తు - తెలంగాణ విమోచన దినోత్సవం

Congress arrangements for telangana liberation day: తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలకు తెలంగాణ పీసీసీ సిద్దమైంది. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కాంగ్రెస్​ పార్టీ మాత్రమే చేయడానికి అర్హత ఉందని.. ఆ పార్టీ నేతలు అంటున్నారు. తమ పార్టీ ఈ ఏడాదంతా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని తీర్మానించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక జెండా, గీతం, విగ్రహం ఆవిష్కరణలపై ప్రకటనకు సిద్ధమైంది.

sep 17
sep 17

By

Published : Sep 16, 2022, 4:04 PM IST

తెలంగాణ విమోచన దినోత్సవానికి కాంగ్రెస్ భారీ కసరత్తు

Congress arrangements for telangana liberation day: రాష్ట్రంలోని తెరాస సర్కార్‌... కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పోటాపోటీగా సెప్టెంబర్‌ 17 వేడుకల నిర్వహణకు సిద్ధమైన వేళ.. వారికి దీటుగా ఉత్సవాలను జరిపేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ తల్లి నూతన విగ్రహం, రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఆవిష్కరణతోపాటు రాష్ట్ర గీతంపై ప్రకటన చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌ సంస్థానానికి స్వాతంత్య్రం సిద్ధించి 75ఏళ్లు అవుతున్న సందర్భంగా ఏడాదంతా వజ్రోత్సవాలు నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

విలీనం, విమోచనం, స్వాతంత్య్రం, సమైక్యతా అంటూ.. రాష్ట్రంలో సెప్టెంబర్‌ 17న జరిగే వేడుకలు ఎవరికి వారు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాటి ప్రధాని నెహ్రూ, హోంమంత్రి వల్లభాయ్‌ పటేల్‌ నేతృత్వంలోని తమ ప్రభుత్వం నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్‌ స్టేట్‌కు స్వాతంత్య్రం కల్పించిందని చెబుతున్న కాంగ్రెస్‌... హైదరాబాద్ స్వాతంత్య్ర దినోత్సవం పేరిట వేడుకలు జరపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పోటీగా వేడుకలను జరిపేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రేపు గాంధీభవన్‌ వేదికగా జరగనున్న వేడుకల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.

తెరాస సర్కార్‌ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్న కాంగ్రెస్‌ కొత్త రూపురేఖలతో విగ్రహాన్ని తయారు చేయించింది. వజ్రోత్సవాల్లో భాగంగా రేపు రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉన్న ఈ విగ్రహాన్ని రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

నూతన రూపురేఖలతో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో పాటు రేపు గాంధీభవన్‌ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్‌ రూపొందించిన ప్రత్యేక జెండాను ఆవిష్కరించేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తులు చేస్తున్నారు. అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతంపై కాంగ్రెస్‌ నేతలు కీలక ప్రకటన చేయనున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరించేలా భాజపా, తెరాసలు వ్యవహరిస్తున్నాయని ఆ పార్టీ విమర్శిస్తోంది. కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే నిజాం పాలన నుంచి హైదరాబాద్‌కు విముక్తి లభించిందని... దానిని తమ గొప్పతనంగా చెప్పుకోవటం సిగ్గుచేటని హస్తం నేతలు మండిపడుతున్నారు.

హైదరాబాద్‌ సంస్థానానికి స్వాతంత్ర్య సిద్ధించి 75ఏళ్లు అవుతున్న సందర్భంగా... ఏడాదిపాటు వజ్రోత్సవాలు నిర్వహించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. కాగా... వజ్రోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్న వేళ ఏఐసీసీ అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విందు సందర్భంగా పార్టీ రాష్ట్ర నేతలంతా సమావేశమయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు పార్టీ సీనియర్లు జానారెడ్డి, వి. హన్మంతురావు, శ్రీధర్‌బాబు, పొన్నం, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. సెప్టెంబర్‌ 17న జరిగే ఏర్పాట్లపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details