Munugode By Poll Candidate in congress : తెలంగాణలోని మునుగోడు ఉపఎన్నికకు అభ్యర్థి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మాజీ ఎంపీ, దివంగత నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ఖరారు చేసింది. అభ్యర్థిగా స్రవంతిని ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఉప ఎన్నికకు కాంగ్రెస్ టికెట్ కోసం పలువురు పోటీ పడ్డారు. స్రవంతితో పాటు స్థానిక నేతలు చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ తదితరులు టికెట్‌ను ఆశించారు. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వారితో ప్రత్యేకంగా సమావేశమై అభిప్రాయాలను సేకరించారు. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల బలాలు, బలహీనతలపై ఏఐసీసీకి నివేదిక పంపించారు. టీపీసీసీ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది.