ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మునుగోడులో కాంగ్రెస్​, భాజపా ప్రచార వ్యూహాలు.. మామూలుగా లేవుగా! - కాంగ్రెస్​ భాజపా ప్రచార వ్యూహాలు

మునుగోడు ఉపఎన్నికలో గులాబీపార్టీకి ధీటుగా భాజపా, కాంగ్రెస్‌లు ప్రచార వ్యూహాలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు ఖరారుకావడంతో.. నియోజకవర్గాన్ని ప్రచారాలు హోరెత్తించనున్నాయి. హైదరాబాద్‌లో ఇవాళ భాజపా స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా కీలక నేతలు.. నియోజకవర్గంలోనే ఉండి విస్తృతం ప్రచారం చేసేలా కాంగ్రెస్‌ ప్రణాళికలు రూపొందించింది.

Congress and BJP campaigning in munugode By election
Congress and BJP campaigning in munugode By election

By

Published : Oct 8, 2022, 10:46 AM IST

Congress and BJP campaigning in munugode By election: సిట్టింగ్‌ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్‌... రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన సీటును గెలిపించుకోవాలని భాజపా మునుగోడు ఉపఎన్నికపై ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఉప ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై భాజపా.. ఇవాళ హైదరాబాద్‌లో స్టీరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించనుంది. పార్టీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డితో పాటూ స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ వివేక్, ఈటల రాజేందర్‌తో పాటూ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లు సునీల్‌ బన్సల్, తరుణ్‌ఛుగ్‌లు సైతం హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి మునుగోడు క్యాంప్‌ కార్యాలయం వేదికగా.. అన్ని మండలాల్లో ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు.

మునుగోడులో కాంగ్రెస్​, భాజపా ప్రచార వ్యూహాలు.. మామూలుగా లేవుగా!

ఇతర పార్టీల నుంచి చేరికలను ఆహ్వానిస్తూ ముందుకెళ్తున్నారు. త్వరలోనే మరో బహిరంగ సభ నిర్వహణపై ఇవాళ్టి సమావేశంలో స్పష్టత రానుంది. పార్టీ అభ్యర్థిగా ఈ నెల 10న నామినేషన్‌ వేయనుండటంతో ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ యోచిస్తుంది. ఆ రోజు పలువురు కేంద్ర మంత్రులను ఆహ్వానించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిషన్‌రెడ్డి, భూపేంద్ర సింగ్‌ యాదవ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్... రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, వివేక్‌ తదితరులు నామినేషన్‌ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. బూత్‌స్థాయి ఇన్‌ఛార్జ్‌లతోనూ ప్రత్యేక భేటీని త్వరలోనే ఖరారు చేయనున్నారు.

అందరి కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ సైతం మునుగోడులో గెలవాలనే పట్టుదలతో శ్రమిస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఈ నెల 14న నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టిన కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతుగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ నెల 9 నుంచి నామినేషన్లకు చివరి రోజైన 14వరకు నియోజకవర్గంలోనే ఉండే అవకాశం ఉంది. మండలాల వారీగా సమీక్షలు నిర్వహించి.. క్యాడర్‌కు దిశానిర్దేశం చేయడంతో పాటూ క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థి గెలుపునకు సైతం ప్రచారం చేయనున్నారు.

ఈ నెల 14న పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్‌ కార్యక్రమంలో సైతం.. రేవంత్‌ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మండలాల వారీగా ప్రకటించిన ఇన్‌ఛార్జ్‌లు సైతం.. ఒకట్రెండు రోజుల్లో క్షేత్రస్థాయి ప్రచారంలో పాల్గొననున్నారు. తమ పార్టీ నుంచి గెలిచి, ఇతర పార్టీల్లోకి వెళ్లిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను... తిరిగి పార్టీలో చేరే విధంగా ఈ 5 రోజులు రేవంత్‌రెడ్డి వ్యూహాలు రచిస్తారని పార్టీ నాయకులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details