వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ గందరగోళంగా మారింది. కడప జిల్లాలో ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో 50మంది అనర్హులుగా అధికారుల నుంచి సమాచారం అందటంతో వారు నిర్ఘాంతపోయారు. నియామక పత్రాలు అందుకున్న రెండు రోజులకే బీకాం అర్హత ఉన్న వారు ఈ పోస్టుకు అర్హులు కాదని అధికారులు వారికి సమాచారమందించారు. ఉద్యోగానికి రాజీనామా చేయాలని తమకు జిల్లా అధికారులు సూచిస్తున్నట్టు బాధితులు వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పోస్టుకు అనర్హులుగా అధికారులు చెప్తున్నవారి సంఖ్య 800 మంది వరకూ ఉండొచ్చంటున్నారు.
ఎంపికైనట్లు చెప్పి... వెంటనే అనర్హులన్నారు
ఉద్యోగాలకు ఎంపికైనట్టు నియామక పత్రాలు ఇచ్చి వెంటనే విధుల్లో చేరాలని చెప్పటంతో వారు ఆనందపడ్డారు. అయితే రోజుల వ్యవధిలోనే ఆ ఉద్యోగానికి అనర్హులని చెప్తూ నిరాశపరిచారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని కొన్ని పోస్టుల నియామకంలో విద్యార్హత విషయంలో గందరగోళం తలెత్తటం వలన పదుల సంఖ్యలో అభ్యర్థులు నైరాశ్యంలో కూరుకుపోతున్నారు.
సచివాలయం
నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతల్లో బీకాం కూడా భాగమేనని ఇప్పుడు ఆ డిగ్రీ ఉన్నవారు అనర్హులనడమేంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నియామక పత్రాలు అందినవారిని అనర్హులుగా ఓ వైపు ప్రకటిస్తున్నా ఇంకా చాలా మందికి నియామక పత్రాలూ అందలేదని కొందరు అభ్యర్థులు వాపోతున్నారు.