ఇంజినీరింగ్ రెండో విడత వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ Confusion over engineering fees: ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇవాళ, రేపు రెండో విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరగనుంది. రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారమే ప్రారంభమైంది. గతంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాని అభ్యర్థులకు ఇవాళ జరగనుంది. ధ్రువపత్రాల పరిశీలన కోసం 3374 మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. ఇవాళ, రేపు వెబ్ ఆప్షన్లు స్వీకరించి ఈనెల 16న సీట్లు కేటాయిస్తారు. మొదటి విడతలో 60208 మందికి సీట్లు దక్కగా... 11078 సీట్లు మిగిలాయి.
వారిలో సుమారు 4వేల మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు. కొన్ని కాలేజీలు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వంటి కోర్సులను వెనక్కి ఇచ్చి సుమారు 7వేల కంప్యూటర్ సీట్లకు అనుమతి పొందాయి. మొత్తం కలిపి 22820 సీట్లు ఇప్పుడు రెండో విడతలో అందుబాటులోకి వచ్చాయి. సీఎస్ఈ, ఏఐఎంఎల్, డేటా సైన్స్ వంటి కోర్సుల్లో 16776 సీట్లు ఉన్నాయి.
రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమైనప్పటికీ... ఫీజులపై గందరగోళం కొనసాగుతోంది. ఫీజుల పెంపుపై టీఎస్ఏఎఫ్ఆర్సీ ఇటీవల ఇంజినీరింగ్ కాలేజీలతో చర్చించి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇవాళ్టి నుంచి వెబ్ ఆప్షన్లు కూడా మొదలైనప్పటికీ.. ప్రభుత్వం ఉత్త్వర్వులు జారీ చేయలేదు. కొన్ని కాలేజీలు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించి భారీగా ఫీజులు పెంచాయి. అవే ఫీజులు కొనసాగుతాయా.. లేదా ప్రభుత్వం సవరిస్తుందా అనే గందరగోళం విద్యార్థుల్లో నెలకొంది.
మరోవైపు కనీస ఫీజు 35 వేల నుంచి 45 వేలకు పెరిగితే.. ప్రభుత్వ రీఎంబర్స్ మెంట్ పెంచుతుందా లేదా అనే ఉత్కంఠ కూడా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొంది. పదివేల ర్యాంకు దాటిన బీసీ, ఈబీసీ విద్యార్థులు కూడా ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్ పెంపు ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. మరోవైపు తమకు సీట్లు పెంచాలన్న కొన్ని కాలేజీల అభ్యర్థనపై కూడా ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయాన్ని వెల్లడించింది. వాటికి అనుమతిస్తే సుమారు మరో 4వేల సీట్లు పెరగనున్నాయి.
ఇవీ చదవండి: