రాష్ట్రంలో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ (డీటీసీపీ) అనుమతి ఉన్న స్థలాల రిజిస్ట్రేషన్ మాత్రమే చేయాలని, దాన్ని ఉల్లంఘించినవారిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తామని హెచ్చరిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీ వి.రామకృష్ణ జారీ చేసిన ఉత్తర్వులు గందరగోళానికి దారితీశాయి. ఆ ఉత్తర్వులతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య బాగా తగ్గింది. ఆ స్థలం అనధికారిక లే అవుట్‌లోదా, గ్రామకంఠంలోదా, ఇదివరకే క్రయవిక్రయాలు జరిగాయా? అన్న తేడాలేమీ లేకుండా.. డీటీసీపీ అనుమతి లేకపోతే ఏ ఖాళీ స్థలాన్నీ రిజిస్ట్రేషన్ చేయబోమని కొందరు సబ్‌రిజిస్ట్రార్లు చెబుతున్నారు. ఎప్పుడో కొన్నేళ్ల క్రితం వేసిన అనధికారిక లేఅవుట్‌లో స్థలాలు కొనుక్కుని, ఇప్పుడు వేరేవారికి విక్రయించినా తాజా ఉత్తర్వుల ప్రకారం రిజిస్ట్రేషన్ కుదరదని చెబుతున్నారు. గ్రామకంఠాల్లోని ఖాళీ స్థలాల్ని రిజిస్ట్రేషన్ చేసేందుకూ కొందరు సబ్ రిజిస్ట్రార్లు నిరాకరిస్తుండటంతో క్రయవిక్రయదారులు అయోమయానికి గురవుతున్నారు.
స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీ.. ఆ శాఖ అధికారులందరికీ ఈ నెల 17న ఒక సర్క్యులర్ జారీ చేశారు. డీటీసీపీ అనుమతి పొందని లేఅవుట్ల వివరాల్ని చాలామంది అధికారులు కార్డ్ సెంట్రలైజ్డ్ ఆర్కిటెక్చర్ (సీసీఏ) మాడ్యూల్‌లో నమోదు చేయడం లేదని, ఇకపై కచ్చితంగా చేసి తీరాలని ఆదేశించారు. డీఐజీలు స్వయంగా దాన్ని పర్యవేక్షించాలని, ప్రతి నెలా నివేదిక పంపాలని సూచించారు. అనధికారిక లేఅవుట్లలోని స్థలాల్ని రిజిస్ట్రేషన్ చేయవద్దని స్పష్టం చేశారు. ఏదైనా స్థలం రిజిస్ట్రేషన్ కోసం వచ్చినప్పుడు డీటీసీపీ వెబ్‌సైట్‌లోని అనధికారిక లేఅవుట్ల జాబితాల్ని పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు.
దీనిపై మరింత స్పష్టతనిస్తూ ఆ మర్నాడే ఆయన మరో సర్క్యులర్ జారీ చేశారు. డీటీసీపీ అనుమతి ఉన్న స్థలాల్ని మాత్రమే రిజిస్టర్ చేసేలా డీఐజీలు, డీఆర్‌లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉల్లంఘించినవారిని డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. దీనిపై ప్రతి నెలా డీఐజీలు, డీఆర్‌లు తనకు నివేదిక పంపాలని స్పష్టం చేశారు. నిషిద్ధ భూముల్లోని (ప్రొహిబిటెడ్ ల్యాండ్స్) స్థలాల రిజిస్ట్రేషన్‌ను నిషేధిస్తూ రెవెన్యూ శాఖ 2020 జనవరి 7న జారీ చేసిన ఉత్తర్వుల్ని ఉటంకిస్తూ ఆయన ఆ సర్క్యులర్ జారీ చేశారు.
ఆనాటి ఉత్తర్వుల్లో ఏముంది?
రాష్ట్రంలో అనధికారిక స్థలాలు, భవనాల రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించాలని అప్పట్లో పురపాలకశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దానిపై రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 2020 జనవరి 7న ఉత్తర్వులు జారీ చేశారు. 1908 నాటి రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం దఖలు పడిన (22-ఎ(1)(ఎ) రీడ్ విత్ 22-ఎ1)(ఇ) సెక్షన్ల ప్రకారం) అధికారాల్ని అనుసరించి అనధికారిక స్థలాలు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ నిషేధిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ద్వారా చేతులు మారిన వ్యవసాయేతర స్థలాలకు, గ్రామకంఠంలోని స్థలాలకు, ఈ ఉత్తర్వులు వెలువడటానికి ముందు నిర్మించిన అనధికారిక భవనాలకు మినహాయింపునిచ్చారు. బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ పథకాల కింద క్రమబద్ధీకరించుకున్న భవనాలకు, స్థలాలకూ మినహాయింపు ఇచ్చారు.