భూముల రీ సర్వే గందరగోళంగా మారింది. రైతులకు ఏమాత్రం భరోసా దక్కట్లేదు. పలువురు రైతులకు భూమి విస్తీర్ణం తగ్గుతోంది. గత 50, 60 ఏళ్లుగా తమ అనుభవంలో ఉన్న భూముల విస్తీర్ణం తగ్గిందని సర్వే, రెవెన్యూ సిబ్బంది చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పాస్ పుస్తకాలు, డాక్యుమెంట్లలో ఉన్న భూమికి, సర్వేలో చెప్పేదానికి కొన్నిచోట్ల సంబంధం ఉండటం లేదు. కొలతల్లో తేడాలు రావడంతో రైతుల మధ్య మనస్పర్థలూ వస్తున్నాయి. గ్రామ సచివాలయాల్లో ఉన్న సర్వే, రెవెన్యూ సిబ్బంది రైతుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కారం గురించి ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేలబావులు, ఉమ్మడిదారులు, ప్రభుత్వ ఆధ్వర్యంలో భూ సేకరణ జరిగిన పొలాల దగ్గర మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత హక్కు- భూరక్ష పథకం కింద భూముల రీ సర్వే జరుగుతోంది.
రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో, కొలతలు తుది దశకు చేరుకున్న గ్రామాల్లో పరిస్థితిని ‘ఈనాడు-ఈటీవీ భారత్’ ప్రతినిధులు పరిశీలించారు. తొలి విడతలో 51 గ్రామాల్లో రీ సర్వే పూర్తయి నెలలు గడిచిపోతున్నా... ఆన్లైన్ అడంగల్‌లో పాత సర్వే నంబర్లు, పాత విస్తీర్ణాలే కనిపిస్తున్నాయి. రైతులకు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు అందలేదు. దీంతో భూముల క్రయ, విక్రయాలు ఏ రికార్డుల ప్రకారం చేస్తారో తెలియట్లేదు. రీ సర్వే పూర్తయినా, చాలాచోట్ల హద్దు రాళ్లు నాటలేదు. రైతులే నాటుకోవాలని సిబ్బంది చెబుతున్నారు.
తగ్గిన భూమి చూపించలేదు..
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం శివరామపురం వాసి పి.శ్రీనివాసులుకు 2.4 ఎకరాల భూమి ఉండగా.. రీ సర్వే తర్వాత దాన్ని 1.97 ఎకరాలుగా చూపించారు. పొలం పది సెంట్ల వరకు తగ్గిందని రాయి పాతారుగానీ, ఆ మేరకు భూమి సర్దుబాటు చేసి చూపించలేదు. అధికారులు ఇచ్చిన పత్రాలకు అనుగుణంగా గట్లు మార్చేందుకు పక్క పొలాల రైతులు అంగీకరించట్లేదు.
బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు..
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చొల్లంగిపాలెంలో 54.78 ఎకరాల భూమిని రెండేళ్ల పాటు సర్వే చేశారు. 60 మంది రైతులకు చెందిన 24.61 ఎకరాల పల్లం భూములు, 2.30 ఎకరాల మెట్ట భూములతోపాటు 17.87 ఎకరాల పోరంబోకు స్థలాన్ని డ్రోన్‌తో సర్వేచేసి ల్యాండ్ పార్శిల్ మ్యాప్ (ఎల్పీఎం) నంబర్లను సృష్టించారు. సర్వే సమయంలో కొందరు భూములు కోల్పోగా మరికొందరికి అదనంగా కలిసొచ్చింది. సర్వే పూర్తయి 6 నెలలు దాటినా ఇప్పటికీ తమకు పాస్‌పుస్తకాలు ఇవ్వలేదని, ఆన్లైన్లో 1బీ, అడంగల్ వివరాలూ లేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదని కాళ్ల రమణ అనే రైతు వాపోతున్నారు. ఈ గ్రామ ఎల్పీఎం నంబర్లను సచివాలయానికి అనుసంధానం చేయకపోవడంతో రిజిస్ట్రేషన్లు జరగడం లేదు.
*నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నువ్వురుపాడులో రీ సర్వే సమయంలో అదనంగా భూమి ఉందని తేల్చి పక్క వారికి కలిపారు. దీంతో రైతులు విభేదించి మళ్లీ రీ సర్వే చేయాలంటున్నారు.
వ్యత్యాసాలపై రైతుల ఆవేదన..
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ అక్కంపేటలో రీ సర్వే తర్వాత కొందరికి భూవిస్తీర్ణం తగ్గి, మరికొందరికి పెరిగింది. ఇక్కడ సెంటు భూమి ఖరీదు రూ.లక్ష. ‘విశ్వనాధుని కండ్రిగ అగ్రహారంలో డొంకరోడ్లు అక్రమణలకు గురై.. రైతులు ఇబ్బంది పడుతున్నారు. రీ సర్వేలో డొంకరోడ్డునూ లెక్క తేల్చి హద్దు రాళ్లు పాతాలి’ అని పల్నాడు జిల్లా యడ్లపాడు మండలానికి చెందిన ఎం.కృష్ణ పేర్కొన్నారు.
2016 సర్వేలో లేని సమస్య ఇప్పుడెందుకు వచ్చింది?..
‘2016లో ప్రభుత్వ సర్వేయర్‌తోనే సర్వే చేయించా. అప్పుడు సమస్య రాలేదు. నా భూమి నా పరిధిలోనే ఉంది. రీ సర్వేలో 13 సెంట్ల వరకు తగ్గింది’ అని సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల వాసి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ డివిజన్లో జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేట, బందరు డివిజన్ బందరు మండలంలోని పొట్లపాలెం, నూజివీడు డివిజన్లో మర్రిబందం, గుడివాడ డివిజన్లో మెరకగూడెం గ్రామాల్లో సర్వే పూర్తయింది. ఈ గ్రామాల్లో హద్దుల కేటాయింపులో ఇంకా సమస్యలు అలానే ఉన్నాయని రైతులు చెబుతున్నారు.
తెలియకుండా హద్దు రాళ్లు నాటారు..
‘కొండ జాగర్లమూడి పరిధిలోని సర్వే నంబరు 26లో మాకు 16 ఎకరాల భూమి ఉంది. రీ సర్వే సందర్భంగా 10 సెంట్లు తగ్గింది. మాకు సంబంధించిన పదెకరాల్లో 6 సెంట్లు తగ్గించుకుంటామని చెప్పాం. ఒకవైపు ఎన్నెస్పీ కాలువ భూమి ఉంటే అందులో పది సెంట్ల భూమిని కలిపి హద్దు రాళ్లు నాటారు. ప్రభుత్వ భూమి వద్దని, మా భూమిలోనే తగ్గించుకుంటామని చెప్పినా అలా చేయలేదు. దీనివల్ల అందరి గట్లు మారుతున్నాయి. గట్టుకు 10 అడుగుల దూరంలో వీటిని నాటారు’ అని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలానికి చెందిన రాంబాబు తెలిపారు.
వారి భూముల్లోనే కొలతలు వేస్తున్నాం- శ్యాంప్రసాద్, సంయుక్త కలెక్టర్, పల్నాడు..
రీసర్వే కోసం గుర్తించిన గ్రామాల్లో రైతుల సమక్షంలోనే కొలతలు వేసి విస్తీర్ణాలను నిర్ధారిస్తున్నాం. సమస్యలు వచ్చినచోట రైతులకు వివరిస్తున్నాం. హద్దు రాళ్లను ఉపాధి హామీ పథకం కింద రైతుల పొలాల్లో పాతుతున్నాం. కొందరికి భూముల విస్తీర్ణం పెరుగుతోంది.
ఆదేశాలకు అనుగుణంగానే రీ సర్వే - పార్థసారధి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, పల్నాడు..
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అనుసరించే రీ సర్వే జరుగుతోంది. రైతులకు ప్రతి దశపైనా అవగాహన కల్పిస్తున్నాం. డ్రోన్ల ద్వారా వచ్చిన ఛాయాచిత్రాలు, రోవర్ల ద్వారా భూముల యథాస్థితిని గుర్తిస్తున్నాం.