అధికార పార్టీ వైకాపాలో ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు లావాలా పెల్లుబుకుతున్నాయి. వర్గ విభేదాలు, కుమ్ములాటలు తీవ్రమవుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, వాగ్వాదాలు, సామాజిక మాధ్యమాల్లో మాటల యుద్ధాల స్థాయిని దాటి... హత్యల వరకు వెళ్లింది. ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో వైకాపా నాయకుడు గంజి నాగ ప్రసాద్‌ని అదే పార్టీకి చెందినవారు శనివారం దారుణంగా హత్య చేయడం, హత్య వెనుక స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలం ఉందంటూ, ఆయనపై దాడికి దిగడం దీనికి పరాకాష్ఠ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బయటపడిన కుమ్ములాటలు... ఇప్పుడు చాలాచోట్ల ముదిరిపాకాన పడ్డాయి. అధికార పార్టీ నాయకులు మంత్రుల ఎదుటే ముష్టి యుద్ధాలకు, బల ప్రదర్శనలకు దిగుతున్నారు. ఫ్లెక్సీలు చించుకుంటున్నారు. చెప్పులు విసురుకుంటున్నారు. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల సమావేశాల్లో బాహాబాహీకి దిగుతున్నారు.
సవాళ్లు చేసుకుంటున్నారు. ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్నచోట రెండు వర్గాలు ఉప్పు, నిప్పులా వ్యవహరిస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నాయకులు వచ్చి చేరినచోట... వారికి, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవారికి మధ్య పొసగడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. వారిద్దరూ కలసి కార్యక్రమాల్లో పాల్గొనలేని పరిస్థితులున్నాయి. రిజర్వుడు నియోజకవర్గాల్లో తమ మాట చెల్లుబాటు కావట్లేదని అక్కడి శాసనసభ్యులు గుర్రుగా ఉన్నారు. శనివారం ఒక్క రోజే... పశ్చిమగోదావరి జిల్లాలో వైకాపా నాయకుడి హత్యతో పాటు, మరో మూడు చోట్ల వైకాపా నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదాలు, గొడవలు జరిగాయి. తెదేపా నుంచి వైకాపాలో చేరిన ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాలు బాహాబాహీకి దిగడంతో చీరాల పురపాలక సమావేశం రసాభాసగా మారింది. నంద్యాలలో ఆక్రమణల తొలగింపుపై కౌన్సిల్ సమావేశంలో వైస్‌ఛైర్మన్ పాంషావలి, కౌన్సిలర్ కృష్ణమోహన్... దాదాపు కొట్టుకున్నంత పనిచేశారు. ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడులో మంత్రి ఆదిమూలపు సురేష్ ఎదుటే వైకాపాలోని రెండు వర్గాలవారు వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
ప్రకాశం బాలినేని అడ్డా
ప్రకాశం జిల్లాలో మంత్రిగా ఉన్నా, లేకపోయినా అంతా తానే అన్నట్లుగా బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. జిల్లా నుంచి బాలినేని, సురేష్ ఇద్దరూ మంత్రులుగా ఉన్నప్పుడూ బాలినేని ఆధిపత్యమే ఉండేది. ఇప్పుడు బాలినేని మంత్రి కాకపోయినా జిల్లాలో ఆయన చెప్పినట్లే సాగుతుండటం మంత్రి సురేష్ వర్గీయులకు మింగుడుపడటం లేదు. ఈ విషయంలో మంత్రి సురేష్ తన అసంతృప్తిని సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఒక వర్గాన్ని ప్రోత్సహించినట్లయిందా?
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి విడదల రజని ఒక వర్గంగా, స్థానిక నేత మర్రి రాజశేఖర్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మరో వర్గంగా కొనసాగుతున్నారు. జనవరిలో పురుషోత్తపట్నంలో రాజశేఖర్ వర్గీయుడు బైరా కృష్ణ ఏర్పాటుచేసిన ప్రభ వద్దకు వెళ్లి వస్తుండగా ఎంపీ కారును మంత్రి మరిది విడదల గోపి, ఆయన మనుషులు అడ్డుకున్నారు. పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలను అక్కడ నుంచి పంపాల్సి వచ్చింది. ఎమ్మెల్యే వర్గీయులపై పోలీసులకు ఎంపీ ఫిర్యాదుచేశారు. చిరుమామిళ్లలోనూ ఇలాగే జరిగింది. రజనికి మంత్రి పదవి ఇవ్వడాన్ని ఎంపీ, ఇతర నేతలు వ్యతిరేకించారు. అయినా ఆమెకు పదవి దక్కడంతో పార్టీ అధిష్ఠానం ఒక వర్గాన్ని కావాలనే ప్రోత్సహించినట్లయిందా అన్న చర్చ మొదలైంది.
ఠాణాలో పరస్పర ఫిర్యాదులు
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్ వర్గాల మధ్య పోరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జనవరిలో ఎమ్మెల్సీ రమేష్ పుట్టినరోజునాడు ఆయన అనుచరులు ప్రొద్దుటూరులో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే అనుచరులు చించేశారు. దీంతో ఎమ్మెల్యే అనుచరుడిపై ఎమ్మెల్సీ వర్గీయులు దాడి చేశారు. వీటిపై రెండు వర్గాల నేతలు పరస్పరం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.
* వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుల మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. ఇటీవల శావల్యాపురంలో నరేంద్ర అనే రైతుపై ఎమ్మెల్యే పీఏ హత్యాయత్నం కేసు పెట్టిన విషయం తెలిసిందే. మల్లికార్జున ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నరేంద్ర అంగులు పీఏసీఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు.
*నగరి నియోజకవర్గంలో... గత ఏడాది డిసెంబరు 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే రోజా వ్యతిరేక వర్గమంతా పుత్తూరులో సమావేశమైంది. అక్కడ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలపై ఎమ్మెల్యే ఫొటోలు లేవు. తర్వాత ఆ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. దీంతో అసమ్మతి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రిజర్వుడు నియోజకవర్గాల్లోనూ రచ్చే
నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో జనవరిలో సచివాలయం, ఆర్బీకే వంటి వివిధ అభివృద్ధి పనులను అప్పటి ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న అనిల్‌కుమార్ యాదవ్ ఆ నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి సిద్దార్థరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమాలతో పాటు మంత్రి పర్యటన సమాచారం ఏదీ స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్‌కు లేకపోవడం చర్చనీయాంశమైంది. ‘నా హక్కులకు భంగం కలిగినప్పుడు దీన్ని శాసనసభా హక్కుల ఉల్లంఘన కమిటీ దృష్టికి తీసుకువెళితే తప్పేంటి’ అనే భావనను ఎమ్మెల్యే ఆర్థర్ పలు టీవీ ఛానెళ్ల ఇంటర్వ్యూలలో వ్యక్తం చేశారు.
*పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు తన నియోజకవర్గంలో ఒక గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి ఒకచోట శంకుస్థాపన చేస్తే... అదే భవనాన్ని జిల్లా మంత్రులు పక్కనున్న మరో గ్రామానికి మార్చారంటున్నారు. ఇదే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎమ్మెల్యే తన కుమారుడితో సహా నలుగురితో జడ్పీటీసీ సభ్యులుగా నామినేషన్లు వేయిస్తే చివరికి అంబాజీపేటలో తప్ప మిగిలిన మూడు మండలాల్లోనూ అభ్యర్థులు మారిపోయారు. ఎమ్మెల్యే కుమారుడికి కూడా టికెట్ దక్కలేదు.
*కోడుమూరు, తాడికొండ, బద్వేలు వంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కంటే పార్టీ పెద్దల మాటే ఎక్కువగా చెల్లుబాటు అవుతోంది.
కొత్తవారొచ్చిన చోట కయ్యాల కాపురం
*చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నియోజకవర్గంలో 2019లో వైకాపా అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్ తన పట్టు నిరూపించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
*దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మధ్య వివాదం కొనసాగుతోంది. దర్శి మున్సిపాలిటీలో వైకాపా పరాజయానికి ఇదే కారణమని పార్టీలో చర్చ జరుగుతోంది.
* జమ్మలమడుగులో వైకాపాలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.