మీర్‌పేటలో తెరాస, భాజపా కార్యకర్తల తోపులాట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో తెరాస, భాజపా కార్యకర్తల నడుమ తోపులాట చోటు చేసుకుంది. నందనవనంలో కృష్ణా పైపులైన్ ప్రారంభోత్సవంలో హస్తినాపురం భాజపా కార్పొరేటర్ సుజాతకు ప్రాధాన్యం ఇవ్వలేదని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమక్షంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎమ్మెల్యే సమక్షంలోనే...
రాష్ట్రంలో భాజపా ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని తరుచుగా అక్కడక్కడా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కార్యక్రమంలో హస్తినాపురం మాజీ కార్పొరేటర్ పద్మా నాయక్‌కు ఇచ్చిన ప్రాధాన్యం.. ప్రస్తుత కార్పొరేటర్‌కు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమక్షంలోనే తమపై దాడి జరిగిందని భాజపా కార్యకర్తలు ఆరోపించారు.
ప్రాధాన్యం లేదు..
ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ కండువాలు కప్పుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కృష్ణా పైపులైన్ ప్రారంభోత్సవాన్ని పార్టీ కార్యక్రమంలాగా నిర్వహించడం ఎంతవరకు సరైందని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని భాజపా కార్పొరేటర్లకు ప్రాధాన్యం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
చర్యలు తీసుకోవాలి
తమపై దాడి చేసిన తెరాస కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని భాజపా కార్యకర్తలు కోరారు. వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మీర్‌పేట పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా భాజపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘటనలో పోలీసులు ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలిపారు.
ఇదీ చదవండి:
పోలీస్ స్టేషన్లో.. దంపతుల ఆత్మహత్యాయత్నం