Yadlapati Passes away: యడ్లపాటి వెంకట్రావు మృతి విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. యడ్లపాటి వ్యక్తిగతంగా తనకు ఎంతో ఆత్మీయులని గుర్తు చేసుకున్నారు. నూరేళ్లకు పైబడిన ఆదర్శవంతమైన, పరిపూర్ణ జీవితాన్ని సాగించారని... నిజాయితీకి చిరునామాగా నిలిచారని అన్నారు. వెంకట్రావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు వెంకయ్యనాయుడు సానుభూతి తెలిపారు.
రాజకీయ కురువృద్ధులు యడ్లపాటి వెంకట్రావు మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. హైదరాబాద్లో యడ్లపాటి కుమార్తె నివాసంలో ఆయన భౌతికకాయానికి చంద్రబాబు నివాళుర్పించి.. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన యడ్లపాటి జీవితం ఎంతో ఆదర్శమన్నారు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిగా యడ్లపాటి గుర్తుండిపోతారని చెప్పారు.
రైతు నాయకుడు యడ్లపాటి మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. తన తండ్రి హయాం నుంచి తమ కుటుంబానికి యడ్లపాటితో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. తాను ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంగం డెయిరీకి వ్యవస్థాపక అధ్యక్షుడని చెప్పిన ధూళిపాళ్ల.. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు.
యడ్లపాటి మృతికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు. యడ్లపాటి జీవితం ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు.. నాయకుడిగా పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అచ్చెన్న అన్నారు.