ఒక ప్రైవేటు సంస్థ ఉద్యోగికి నెలకు రూ.30వేల వేతనం వచ్చేది. వేతనం రూ.15వేలైనా ప్రభుత్వ ఉద్యోగమంటే భద్రత ఉంటుందన్న ఆశతో పరీక్షలు రాసి గుంటూరులో వార్డు సచివాలయ ఉద్యోగిగా ఎంపికయ్యారు. రెండేళ్లు దాటినా ఆయనకు నెలకు వస్తున్న వేతనం ఆ రూ.15వేలే. ఇంటి అద్దె, పిల్లల పాఠశాలల ఫీజులు, రోజువారీ ఖర్చులతో ఆయన పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. నెలకు రూ.10వేల అప్పు చేస్తే తప్ప గడవటం లేదు. ఆయన ఒక్కరే కాదు.. గ్రామ, వార్డు సచివాలయాల్లోని అత్యధిక ఉద్యోగుల పరిస్థితి ఇదే. రెండేళ్లు పూర్తయ్యాక ప్రొబేషన్ ఖరారుచేసి రెగ్యులర్ పేస్కేల్ ఇవ్వాల్సిన ప్రభుత్వం వాయిదా వేస్తుండటంతో ఉద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు నుంచి వివిధ కార్యక్రమాల నిర్వహణ వరకు వారిదే బాధ్యత. లేఅవుట్లలో పేదలకిచ్చే ఇళ్ల స్థలాల చదును, ఇళ్ల పన్ను, చెత్తపై రుసుము వసూళ్ల వంటివి అదనం. ద్విచక్ర వాహనానికి పెట్రోల్, యూనిఫాం కుట్టు ఖర్చుల వరకు ఏవైనా ఇచ్చే వేతనంలో సర్దుకోవాల్సిందే.
56 వేల మంది ఉత్తీర్ణత
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో సుమారు 56వేల మంది శాఖాపరమైన పరీక్షల్లో ఇప్పటికే ఉత్తీర్ణులయ్యారు. మరో 15వేల మంది మహిళా పోలీసులకు సంబంధించిన పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. తొలి దశలో ఎంపికైన ఉద్యోగులంతా 2022 జూన్ నెలాఖరులోగా శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా చూడాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు దాదాపు 15వేల మంది ఆరోగ్య కార్యదర్శులకు త్వరలో శాఖాపరమైన పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన 56వేల మందికి ప్రొబేషన్ ఖరారు చేసి రెగ్యులర్ పేస్కేల్ ఇస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతైనా బయటపడేవారు.