ఏకకాలంలో వేర్వేరు సర్వేలు చేయడానికి తాము మర మనుషులం కాదని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ స్పష్టంచేసింది. వైద్యారోగ్య శాఖ నుంచి వచ్చే ఆదేశాలతో క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలు, ఇతర ఆరోగ్య సిబ్బంది అల్లాడుతున్నారని వాపోయింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదలచేసింది.
ప్రతిరోజూ కొవిడ్ టీకాలు ఇవ్వడం, ఇంటింటికీ వెళ్లి, బీపీ, షుగర్, ఇతర జబ్బుల వివరాలను నమోదు చేయడం, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఐరన్ ఫోలిక్ సిరప్ ఇవ్వడం, డెంగీ జ్వరాల నియంత్రణ చర్యలు తీసుకోవడం తదితర పనులు చేయాల్సివుంది. అలాగే... ప్రతిరోజూ హోంఐసొలేషన్‌లో ఉండే కొవిడ్ బాధితుల బాగోగులు చూడటం, ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించడం, హెచ్‌ఎంఎస్ రిపోర్టులకు తగిన సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ఇబ్బందిగా ఉందంది. వీటికి అదనంగా జూమ్ కాన్ఫరెన్సులు ఉన్నాయంది. ఒక సర్వే పూర్తిచేసిన అనంతరం మరోటి చేసేందుకు అవకాశాన్ని కల్పించాలని వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శికి విన్నవించింది.