పోటీ పరీక్షల పాఠ్య ప్రణాళికపై.... విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. కరోనా వల్ల... రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ సిలబస్‌ను 30 శాతం తగ్గించింది. అయితే జేఈఈ మెయిన్స్, నీట్ సిలబస్ తగ్గింపుపై... జాతీయ పరీక్షల మండలి-ఎన్టీఏ ఆసక్తి చూపడం లేదు. పాఠ్య ప్రణాళికను చాలా రాష్ట్రాలు తగ్గించలేదన్న కారణంగా... దేశం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని పరీక్షలు నిర్వహించాలని ఎన్టీఏ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పోటీ, బోర్డు పరీక్షల అంశంపై..... కేంద్ర మానవ వనరుల శాఖ ఈనెల 10న వెబినార్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం విద్యార్థుల నుంచి సూచనలు, సలహాలు, సందేహాలు స్వీకరించగా... భారీ స్పందన వచ్చినట్లు ప్రకటించింది.
వాస్తవానికి ఈనెల 3న వెబినార్ నిర్వహించాల్సి ఉండగా... విద్యార్థులు, విద్యావేత్తలు, అధ్యాపకుల నుంచి వస్తున్న స్పందనతో పొడిగించారు. ఈ నేపథ్యంలో... జేఈఈ, నీట్ సిలబస్‌పై కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయంపై విద్యార్థులు ఆసక్తితో ఉన్నారు. జూన్‌లో తెరుచుకోవాల్సిన విద్యాసంస్థలు... కరోనా వల్ల నవంబర్‌లో ప్రారంభమయ్యాయి. చాలావరకూ ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించారు. కళాశాలలు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల......సీబీఎస్సీ,ఐసీఎస్ఈ వంటి బోర్డులు 30 శాతం సిలబస్ తగ్గించాయి.