ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్​తో 30 రోజుల్లోగా మరణిస్తే పరిహారం! - కరోనా న్యూస్

కొవిడ్ బారిన పడిన నాటినుంచి 30 రోజుల్లోగా మరణిస్తే వాటిని కరోనా మరణాలుగా పరిగణించాలని అధికారులకు రాష్ట్ర వైద్యరోగ్య శాఖ సూచించింది. ఈ మేరకు కేంద్ర మార్గదర్శకాలను జిల్లాలకు పంపించింది. ఈ మార్గదర్శకాలను అనుసరించి మృతుల కుటుంబాలకు పరిహారం అందించనున్నట్లు తెలిపింది.

Compensation to covid  death
Compensation to covid death

By

Published : Oct 28, 2021, 7:15 AM IST

Updated : Oct 28, 2021, 8:59 AM IST

కరోనా వైరస్‌ సోకినట్లు తేలినప్పటి నుంచి 30 రోజుల్లో సంభవించిన మరణాలను కొవిడ్‌ మరణాలుగానే పరిగణించాలని అధికారులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. వీటి ఆధారాలను పరిశీలించి జిల్లా రెవెన్యూ డివిజన్‌ అధికారి నేతృత్వంలో ఏర్పడే కమిటీ వైద్య ధ్రువీకరణ పత్రాలు (మెడికల్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాజ్‌ ఆఫ్‌ డెత్‌) జారీచేయాలని జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. కమిటీ నివేదించిన 14 రోజుల్లోగా నష్టపరిహారం కింద దరఖాస్తు చేసిన వారికి రూ.50వేలు అందజేయాలని తెలిపింది. బాధిత కుటుంబం నుంచి దరఖాస్తు అందిన 30 రోజుల్లోగా ధ్రువీకరణపత్రం మంజూరు కావాలని షరతు పెట్టింది. రాష్ట్రంలో అధికారికంగా బుధవారం వరకు 14,364 కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. ఈ లెక్కలోకి రాని మరణాలెన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ సోకి 30 రోజుల్లో మరణించిన వారి కుటుంబాలవారు పరిహారం అందుకునేందుకు అర్హులని కేంద్రం ప్రకటించడం ద్వారా లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది. సర్టిఫికెట్ల జారీకి అనుసరించాల్సిన నిబంధనలు తెలిపే కేంద్ర మార్గదర్శకాలను గతనెల 8న ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ గీతా ప్రసాదిని జిల్లా అధికారులకు పంపించారు. దీనికి కొనసాగింపుగా ఈ నెల 6న, 25న రెండు జీఓలను వైద్య ఆరోగ్య శాఖ జారీచేసింది.

పాజిటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి

ఆర్టీ-పీసీఆర్‌/ మాలిక్యూలర్‌ టెస్ట్‌/ ర్యాపిడ్‌ యాంటీజెన్‌/ క్లినికల్‌ (సీటీ స్కాన్‌, ఇతర) పద్ధతుల్లో చేసిన పరీక్షల ద్వారా కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ జరగాలి. ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొంది ఉండాలి. ఆసుపత్రుల్లో చేరి, 30 రోజులు దాటి మరణించినా అది కొవిడ్‌ కిందకే వస్తుంది. ఆసుపత్రుల్లో చికిత్స పొంది, డిశ్ఛార్జి అయి ఇంటికి వచ్చాక మరణించినా అందుకు కొవిడ్‌ కారణమనే గుర్తించాలి. మరణించినట్లు ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేస్తేనే దరఖాస్తు చేసుకోవాలి. కొవిడ్‌ సోకి విషం తాగినవారు, ప్రమాదంలో మరణించిన వారు, ఆత్మహత్య చేసుకున్నవారు అనర్హులు.

సర్టిఫికెట్లలో కానరాని కారణాలు

సాధారణంగా ప్రభుత్వాసుపత్రుల్లో మరణిస్తే అక్కడే ధ్రువీకరణపత్రం ఇస్తారు. కానీ అందులో మరణ కారణం ఉండదు. కారణాలు బయట పెట్టకూడదనే సర్టిఫికెట్‌లో రాయట్లేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో మరణిస్తే స్థానిక సంస్థల్లో సర్టిఫికెట్‌ ఇస్తున్నారు. మలివిడత కొవిడ్‌ సమయంలో ఆసుపత్రుల్లో మరణిస్తే కోరినవారికి అదనంగా మరో సర్టిఫికెట్‌ ఇచ్చి, అందులో ‘కాజ్‌ ఆఫ్‌ డెత్‌’ నమోదు చేస్తున్నారు.

కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్‌

ఆధారాలు పరిశీలించి కాజ్‌ ఆఫ్‌ డెత్‌ సర్టిఫికెట్‌ను జారీచేసేందుకు జేసీ ఛైర్మన్‌గా కమిటీని ఏర్పాటుచేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఈ నెల 6న జీఓ 528 జారీచేసింది. ఈ కమిటీలో డీఎంహెచ్‌ఓ, బోధనాసుపత్రి సూపరింటెండెంట్‌, సబ్జెక్టు నిపుణులు సభ్యులు. జీఓ 543 ద్వారా డీఆర్‌ఓ నేతృత్వంలో ‘డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ కొవిడ్‌ డెత్‌ అసెర్టింగ్‌ కమిటీ’ని ఏర్పాటుచేయాలని కలెక్టర్లను వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. ఈ కమిటీ కలెక్టరేట్‌లో ఉండాలన్నారు. దరఖాస్తు అందిన 30 రోజుల్లోగా సర్టిఫికెట్‌ జారీ చేయాలని సూచించారు. కమిటీకి బాధిత కుటుంబాలు నష్టపరిహారం కోసం దరఖాస్తు చేయాలి. అందులోని వివరాలను కమిటీ పరిశీలించి, ప్రతిపాదనలను కలెక్టర్‌కి సమర్పించాలి. బాధితుడు కొవిడ్‌-19తోనే మరణించినట్లు సర్టిఫికెట్‌ ఇవ్వాలి. కమిటీ నుంచి అందిన జాబితాలోని బాధిత కుటుంబాలకు రెండు వారాల్లోగా నష్టపరిహారం అందజేసేలా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలి.

*బాధిత కుటుంబాల వారు ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌, బ్యాంకు ఖాతా, ఆధార్‌, డెత్‌ సర్టిఫికెట్‌, ఇతర ఆధారాలను దరఖాస్తుతోపాటు జతచేయాలి. దరఖాస్తులో ఆశా, ఏఎన్‌ఎం, మెడికల్‌ ఆఫీసర్‌ సంతకాలు చేసి ఉండాలి.

*కమిటీ నిర్ణయంతో సంతృప్తి చెందనివారు అప్పీలు చేసుకోవడానికీ కేంద్రం వీలు కల్పించింది. జిల్లాల్లో ఉండే అదనపు కలెక్టర్‌ నేతృత్వంలో ఏర్పడే కమిటీని ఆశ్రయించొచ్చు.

ఇదీ చదవండి:

కొవిడ్​తో మరణించిన పోలీసుల కుటుంబాలకు సర్కారు ఆర్థిక సాయం.. ఎంతంటే?

Last Updated : Oct 28, 2021, 8:59 AM IST

ABOUT THE AUTHOR

...view details