ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలవరంపై రిటైర్డు న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ - పోలవరం ప్రాజెక్టు నిర్మాణం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల పరిశీలనకు హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ వెల్లడించింది.

polavaram
polavaram

By

Published : Feb 24, 2021, 7:34 AM IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల పరిశీలనకు హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ వెల్లడించింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించి దీనికి నేతృత్వం వహించే న్యాయమూర్తి పేరు ఖరారు చేస్తామని జస్టిస్‌ ఆదర్శకుమార్‌ గోయల్‌ నేతృత్వంలోని ఎన్‌జీటీ బెంచ్‌ మంగళవారం స్పష్టం చేసింది. ప్రాజెక్టు ప్రాంతంలో డంపింగ్‌ వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో భూమి కుంగిపోవడంపై సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు దాఖలుచేసిన కేసు విచారణ సందర్భంగా ట్రైబ్యునల్‌ ఈ విషయాన్ని వెల్లడించింది.

పిటిషనర్‌ తరఫున న్యాయవాది శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ 2015 నుంచి తాము మూడు పిటిషన్లు దాఖలుచేసినా క్షేత్రస్థాయిలో మార్పేమీ లేదన్నారు. ‘పోలవరంలో పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే 2016, 18లో 203 ఎకరాల అదనపు భూమిని తీసుకొని డంపింగ్‌ మొదలుపెట్టారు. ప్రాజెక్టు కోసం తవ్వితీసిన మట్టిని ఇక్కడ పారబోయడం వల్ల చుట్టుపక్కల 20 అడుగుల లోతున భూమి కుంగిపోయి భూకంపం లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాఫర్‌డ్యాం నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పునరావాసం కల్పించడానికి ముందే ముంపు తలెత్తింది. నిపుణుల కమిటీల నివేదికలను అమలుచేయట్లేదు.’ అని తెలిపారు.

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున మెహ్‌ఫూజ్‌ నజ్కీ వాదనలు వినిపిస్తూ నిపుణుల సూచనలు, సలహాలపై ప్రభుత్వం చర్యలు తీసుకొందన్నారు. తమ ప్రతిపాదనలను కేంద్ర జలసంఘానికి పంపామని, ప్రస్తుతం దాని అనుమతుల కోసం వేచి చూస్తున్నాం తప్ప కార్యాచరణ చేపట్టకుండా లేమన్నారు. అప్పుడు ట్రైబ్యునల్‌ నిపుణ సభ్యుడు చేసుకుంటూ ‘నష్టం జరిగిన తర్వాత దిద్దుబాటు మొదలుపెట్టడాన్ని కార్యాచరణ లేమి అనకుండా ఇంకేమంటాం? పర్యావరణ ప్రభావాలపై అధ్యయనం లేకుండా పనులు చేపట్టినట్టుంది.’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ పట్ల తాము సంతృప్తికరంగా లేమని ఛైర్మన్‌ జస్టిస్‌ ఆదర్శకుమార్‌ గోయల్‌ అన్నారు. ట్రైబ్యునల్‌ స్పందిస్తూ రిటైర్డ్‌ న్యాయమూర్తితో కమిటీ వేస్తామని చెప్పింది.

జల విద్యుత్తు ప్రాజెక్టుకు మళ్లీ ఎల్‌వోఏ

పోలవరం జల విద్యుత్తు కేంద్రం పనులను ప్రారంభించటానికి లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌(ఎల్‌వోఏ) చేసుకోవాలని గుత్తేదారు సంస్థ మేఘా ఇంజినీరింగ్‌కు ఏపీ జెన్‌కో లేఖ రాసింది. పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు జల విద్యుత్తు కేంద్రం పనులను కలిపి జలవనరుల శాఖ అధికారులు టెండరు నిర్వహించారు. 960 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం నిర్మాణానికి రూ.3,200 కోట్లతో జెన్‌కో ప్రతిపాదనలు రూపొందించింది. రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియలో రూ.2,800 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును చేపట్టేలా మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ పనులు దక్కించుకుంది. అయితే, ఇవే పనులకు సంబంధించి కోర్టు వివాదం అడ్డంకిగా ఉండటంతో మేఘా సంస్థ పనులను ప్రారంభించలేదు. ఇటివల కేసులు కొలిక్కి వచ్చాయి.

ఇదీ చదవండి:దుర్గగుడిలో అక్రమార్కులపై వేటు.. 15మంది ఉద్యోగుల సస్పెన్షన్

ABOUT THE AUTHOR

...view details