ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యలో ప్రవేశాలను మరో మూడేళ్ల వరకు యథాతథంగా జరపాల్సిన అవసరం ఉందని.. నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటికిప్పుడు ఏకీకృత కౌన్సెలింగ్ విధానంలో చేరడం మంచిది కాదని పేర్కొంది. కేంద్రీకృత విధానంలో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహణ ప్రతిపాదనను ఇటీవల కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ.. రాష్ట్ర ప్రభుత్వాలకు వివరించి.. అభిప్రాయాలను లిఖితపూర్వకంగా కోరింది.
ఈ విషయంపై నివేదిక సమర్పించాలని ఐదుగురితో రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ కమిటీ వేసింది. పలు దఫాలుగా చర్చించి రూపొందించిన నివేదికను వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్‌కు సోమవారం అందజేసినట్లు.. కమిటీ ఛైర్మన్, ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి.. ప్రొఫెసర్ శ్యాం ప్రసాద్ తెలిపారు.