అమరావతిలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన, వివిధ దశల్లో నిలిపివేసిన భవనాలు, నివాస గృహాల్ని (హౌసింగ్ యూనిట్స్) ఏం చేయాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాల్ని పరిశీలిస్తోంది. వాటిలో శాసన రాజధానికి తప్పనిసరిగా కావాల్సిన భవనాలేవో గుర్తించేందుకు గురువారం ఒక కమిటీని నియమించింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఛైర్మన్‌గా వ్యవహరించే కమిటీలో ఏడుగురు సభ్యులుగా ఉంటారు. శాసనసభ కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్), పురపాలక శాఖ, ఆర్థికశాఖల ముఖ్య కార్యదర్శులు, న్యాయశాఖ కార్యదర్శి, అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఏఎంఆర్‌డీఏ) కమిషనర్ సభ్యులు. ప్రణాళికా విభాగం కార్యదర్శి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
ఇప్పటికీ పూర్తికాని అపార్ట్‌మెంట్ యూనిట్లు, బంగ్లాల్లో శాసన రాజధానికి అవసరం అనుకున్న వాటి నిర్మాణాన్ని కొనసాగించాలా? ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించేందుకు ఇతర మార్గాలేమైనా అన్వేషించాలా? అన్న అంశంపై ఈ కమిటీ సిఫారసులు చేస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. సీఎస్‌తో ఒక కమిటీని వేయాలని 2020 ఆగస్టులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం ఆదేశించారని, దానిపై ఏఎంఆర్‌డీఏ కమిషనర్ 2020 డిసెంబరు 4న లేఖ రాస్తే.. ఇప్పుడు కమిటీ వేస్తున్నామని పురపాలక శాఖ జారీ చేసిన ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల చట్టం తెచ్చిన నేపథ్యంలో.. అమరావతిలో నిర్మాణం ప్రారంభించి నిలిపివేసిన సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ టవర్లు, హైకోర్టు శాశ్వత భవనాలపై ఒక నిర్ణయం తీసుకోవాలని కమిషనర్ తన లేఖలో కోరినట్లు తెలిపారు. ఆ మేరకు ఇప్పుడు కమిటీ వేస్తున్నట్లు వెల్లడించారు. అమరావతి, విశాఖపట్నాల్లో ప్రాజెక్టులపై సీఎం జగన్ సోమవారం అధికారులతో సమీక్షించారు.
అది ప్రధానంగా మిషన్ బిల్డ్‌ఏపీలో భాగంగా నిధులు సమకూర్చుకునేందుకు ఉద్దేశించిన సమావేశమని అధికార వర్గాల సమాచారం. మిషన్ బిల్డ్ ఏపీకి కన్సల్టెన్సీ సంస్థగా వ్యవహరిస్తున్న జాతీయ భవన నిర్మాణ సంస్థ ప్రతినిధులూ ఆ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి విషయంలో ప్రభుత్వ ఉద్దేశమేమిటో ఇతమిత్థంగా తెలియకపోయినా.. సీఎంతో సమావేశం తర్వాత ఉన్నతాధికారులంతా కదిలారు.