committee of ministers meet with AP employees: ఉద్యోగ సంఘాలతో సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం ప్రారంభమైంది. హెచ్‌ఆర్‌ఏ స్లాబ్ లు, ఐఆర్ రికవరీతో పాటు నిన్న అర్ధరాత్రి ప్రతిపాదించిన అంశాలపై చర్చ కొనసాగుతోంది. హెచ్‌ఆర్‌ఏ పై మంత్రుల కమిటీ కొత్త ప్రతిపాదనలు ముందుంచింది. అయితే ఆయా ప్రతిపాదనలపై ఉద్యోగుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.
హెచ్‌ఆర్‌ఏ పై మంత్రుల కమిటీ కొత్త ప్రతిపాదనలు..
హెచ్‌ఆర్‌ఏ స్లాబులపై కొత్త ప్రతిపాదనలను మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతల ముందు ఉంచింది. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 10 వేల సీలింగ్‌తో 8 శాతం హెచ్‌ఆర్‌ఏ, 2 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 10 వేల సీలింగ్‌తో 9.5 శాతం, 10 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 15 వేల సీలింగ్‌తో 13.5 శాతం, 25 లక్షల్లోపు జనాభా ఉన్నా ప్రాంతాల్లో రూ. 20 వేల సీలింగ్‌తో 16 శాతం, సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు రూ. 23 వేల సీలింగ్‌తో 24 శాతం ఇస్తామని మంత్రుల కమిటీ పేర్కొంది.
- 50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో రూ.10 వేల సీలింగ్‌తో 8 శాతం
- 2 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.10 వేల సీలింగ్‌తో 9.5 శాతం
- 5 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.12 వేల సీలింగ్‌తో 13.5 శాతం
- 10 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.15 వేల సీలింగ్‌తో 16 శాతం
- 25 లక్షల్లోపు జనాభా ప్రాంతాల్లో రూ.20 వేల సీలింగ్‌తో 16 శాతం
- సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు రూ.23 వేల సీలింగ్‌తో 24 శాతం
మరోవైపు ఉద్యోగ సంఘాల నేతల సమావేశంలో ఫిట్‌మెంట్‌పై మంత్రుల కమిటీ స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. ఫిట్‌మెంట్ 23 శాతమే ఇస్తామని తేల్చి చెప్పింది. ఐఆర్ రికవరీ చేయబోమని మరోమారు స్పష్టం చేసింది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ అమలుకు మంత్రుల కమిటీ సుముఖతను వ్యక్తం చేసింది.