తెలంగాణ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట మండలంలోని దేవరయాంజాల్‌లోని సీతారామచంద్రస్వామి ఆలయ భూముల ఆక్రమణల ఆరోపణలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐఏఎస్‌ల కమిటీ సోమవారం రంగంలోకి దిగింది. పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారులు ప్రశాంత్ జీవన్ పాటిల్, భారతీ హోళికేరి, శ్వేతా మహంతి క్షేత్రస్థాయిలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిర్మించిన గోదాములను పరిశీలించారు.
దేవస్థానానికి చెందిన 1521 ఎకరాల 13 గుంటల భూమి ఆక్రమణకు గురైందని ఆరోపణలున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేవాలయానికి సంబంధించిన భూముల్లో చేపట్టిన అక్రమ కట్టడాలు, నిర్మాణాలను పరిశీలించారు.