రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్లు, కుటుంబ పింఛన్లకు సంబంధించిన అంశాలను లోతుగా పరిశీలించి పరిష్కరించేందుకు నిపుణుల కమిటీ, సాంకేతిక కమిటీ కలిసి కసరత్తు చేయాలని ఉన్నతాధికారులు నిర్దేశించారు. మార్చి 18న నిర్వహించిన సమావేశంలో క్షేత్రస్థాయి అధికారులనుంచి వచ్చిన అభ్యంతరాలు, ఇబ్బందులపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఈ మేరకు ఖజానా శాఖకు చెందిన అయిదుగురు అనుభవజ్ఞులతో డైరెక్టర్ హన్మంతరావు ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేశారు. తదనుగుణంగా సీఎఫ్‌ఎంఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి లేఖ రాశారు. సీఎఫ్‌ఎంఎస్ నుంచి అనుభవజ్ఞులను పంపిస్తే ట్రెజరీ కోడ్, నిబంధనలపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాంకేతికంగా తీసుకోవాల్సిన మార్పులను సూచిస్తారని తెలిపారు.
మూడు రోజుల పాటు సమావేశం..
ఏప్రిల్ 6వ తేదీ నుంచి 3రోజులపాటు ఈ రెండు బృందాలు ఇబ్రహీంపట్నంలో సమావేశమవుతాయి. నిధుల రూపంలో ప్రభుత్వం నష్టపోకుండా పరిష్కార మార్గాలను సూచిస్తాయి. కాకినాడ, ఏలూరు సహాయ ఖజానా అధికారులు ఎం.వి.వి.ఎస్.సోమయాజులు, డి.కృష్ణంరాజు, తాడేపల్లిగూడెం ఉపఖజానా అధికారి పి.జయదత్తేశ్వరరావు, శ్రీకాకుళం, అనంతపురం డిప్యూటీ డైరెక్టర్లు ఎం.తులసీరావు, మసూద్‌వలీలకు ఈ బాధ్యతలను అప్పగించారు.
ఇతర రాష్ట్రాల పింఛనర్లకు సైతం ప్రభుత్వం ప్రకటించిన 27శాతం ఐఆర్ చెల్లింపులు సాగిపోతున్నాయనే అంశం ప్రధానంగా వెలుగులోకి వచ్చింది. 2014 తర్వాత తెలంగాణనుంచి ఏపీకి వచ్చినవారు, పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్న వారి వివరాలు గుర్తించడం సులభమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో పదవీ విరమణ చేసి ఆనక అటూ ఇటూ మారిన వారి విషయంలో వారు ఏ రాష్ట్రానికి చెందిన పింఛనరు అన్నది గుర్తించడంలో సమస్యలు ఎదురవుతున్నాయని ఖజానాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 3.60 లక్షల మంది పింఛనర్లు ఉన్నారు. ఇతర రాష్ట్రాల పింఛనర్లకు ఎవరికి ఎలా చెల్లింపులు కొనసాగాలో సాంకేతికంగా ప్యాకేజీ తయారుచేయాల్సి ఉంది.