ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఇంటర్ రెండో ఏడాది ఫలితాలకు(INTER RESULTS).. ప్రథమ సంవత్సరం మార్కులతో పాటు పదో తరగతి మార్కులను పరిగణనలోకి తీసుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మార్కుల మదింపునకు నియమించిన ఛాయరతన్ కమిటీ రెండు, మూడు రోజుల్లో నివేదికను ఇంటర్ విద్యామండలి కార్యదర్శికి సమర్పించనున్నట్లు సమాచారం. ఇంటర్ రెండో ఏడాది విద్యార్థులు 2019లో పది, 2020లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను రాశారు. ఈ రెండింటిని కలిపి రెండో ఏడాది మార్కులను ఖరారు చేయాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది.
ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మార్కులిలా..
పదోతరగతి మార్కులకు 30శాతం, బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు ప్రథమ సంవత్సరంతో పాటు ఇటీవల నిర్వహించిన ప్రయోగ పరీక్షలతో కలిపి 70శాతం చొప్పున వెయిటేజీ తీసుకొని రెండో ఏడాదికి వంద శాతానికి మార్కులను ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆర్ట్స్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉండనందున ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కులకే 70శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకోసం పదో తరగతి మార్కుల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగాన్ని ఇంటర్ విద్యామండలి కోరింది. ఇంటర్ మొదటి ఏడాది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ బ్యాచ్ విద్యార్థులు గతేడాది పదోతరగతి పరీక్షలు రాయలేదు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. దీంతో వీరి ఫలితాల విడుదలకు ఏ విధానం పాటించాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. మొదటి ఏడాదికి అందరికీ ఉత్తీర్ణత మార్కులు ఇవ్వడమా? లేదంటే రెండో ఏడాది పరీక్షలు పూర్తయిన తర్వాత వాటి ఆధారంగా మొదటి ఏడాదికి మార్కులు ఇవ్వడమా? కరోనా తగ్గిన తర్వాత అంతర్గతంగా ఏమైన పరీక్షలు నిర్వహించడమా? అనేదానిపై సమాలోచనలు చేస్తున్నారు.
పదిపైనా కమిటీ ఏర్పాటు..