ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Commercial Gas: పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర...చిరు వ్యాపారుల గుండెల్లో గుబులు

వాణిజ్య అవసరాలకు వినియోగించే వంటగ్యాస్‌ సిలిండర్‌ (19కిలోలు)పై రూ.270 చొప్పున పెరిగింది. దీంతో పెద్దపెద్ద హోటళ్లకే కాదు.. రోడ్డు పక్క తోపుడు బళ్లపై అల్పాహారం విక్రయించే చిరు వ్యాపారుల్లోనూ ఆవేదన వ్యక్తమవుతోంది.

Commercial Gas
పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలు

By

Published : Nov 2, 2021, 8:20 AM IST

వాణిజ్య అవసరాలకు వినియోగించే వంటగ్యాస్‌ సిలిండర్‌ (19కిలోలు)పై రూ.270 చొప్పున పెరిగింది. దీంతో విజయవాడలో సిలిండర్‌ ధర రూ.2,116 అయింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అయితే రూ.2,160 నుంచి రూ.2,170 వరకు చేరింది. దీంతో పెద్దపెద్ద హోటళ్లకే కాదు.. రోడ్డు పక్క తోపుడుబళ్లపై అల్పాహారం విక్రయించే చిరు వ్యాపారుల్లోనూ ఆవేదన వ్యక్తమవుతోంది. ఇంత ధరతో సిలిండర్‌ కొని వ్యాపారం చేయాలంటే గిట్టుబాటు కాదని వారు వాపోతున్నారు. ఖర్చులు పెరిగాయని అల్పాహారం ధరలు పెంచితే వినియోగదారులు రావడం లేదని చిరు వ్యాపారులు పేర్కొంటున్నారు. గృహావసర సిలిండర్ల ధరలూ త్వరలోనే భారీగా పెరిగే అవకాశం ఉందని, ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో దీనిపై నిర్ణయంలో జాప్యం జరుగుతోందని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. వాణిజ్య వినియోగ సిలిండర్ల ధరలు నెలలో ఒకటి రెండుసార్లు పెంచుతున్నారు. మార్చి నుంచి పరిశీలిస్తే.. నవంబరు1 నాటికి ఒక్కో సిలిండర్‌పై రూ.400 చొప్పున పెరిగింది. గతంలో రూ.50, రూ.100 చొప్పున పెంచుతూ వచ్చిన ఇంధన సంస్థలు.. జులైలో రూ.122 తగ్గించాయి. తర్వాత మళ్లీ పెంచాయి. ఏకంగా రూ.266 పెంచడం ఇదే తొలిసారని వ్యాపారులు పేర్కొంటున్నారు.

వాణిజ్యం నుంచి గృహావసర సిలిండర్లకు..

వాణిజ్య సిలిండర్లు వినియోగించే వారికి కిలోగ్యాస్‌ రూ.112 వరకు పడుతోంది. ఇదే గృహావసర సిలిండర్లు అయితే కిలో రూ.65 చొప్పునే వస్తోంది. 19 కిలోల సిలిండర్‌ ధర రూ.2,116 వరకుంటే.. గృహ వినియోగ 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ.922 ఉంది. ఈ భారం భరించలేని చిరువ్యాపారులు వాణిజ్య సిలిండర్లను పక్కన పడేసి చట్టవిరుద్ధమైనప్పటికీ తమ ఇంటి అవసరాలకు తీసుకున్న సిలిండర్‌నే ఉపయోగించుకుంటున్నారు. ఈ సిలిండర్లు బ్లాకులో ఒక్కోటి రూ.1,250 చొప్పున లభిస్తున్నాయి.

ఇదీ చదవండి :

Minister Peddi Reddy: ఆ పరిశ్రమలపై కేసులు పెట్టండి: మంత్రి

ABOUT THE AUTHOR

...view details