సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోశ్ బాబు కుటుంబ సభ్యుల్ని వారి నివాసంలో... బంధువులు, సన్నిహితులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పరామర్శించారు. సూర్యాపేట విద్యానగర్‌లోని ఆయన స్వగృహానికి... ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు. వీధి చుట్టూ ఎక్కడికక్కడ... బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొవిడ్ తీవ్రత దృష్ట్యా కల్నల్ ఇంటి వద్ద ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సోడియం హైపోక్లోరైడ్‌తో పరిసరాలను పిచికారీ చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అమర సైనికాధికారి సంతోశ్ బాబు అంత్యక్రియలు... సూర్యాపేట సమీపంలోని కేసారంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి. సైనిక, అధికార లాంఛనాల నడుమ ఉదయం ఎనిమిది గంటలకు తుది ఘట్టం నిర్వహించనున్నారు. ఇందుకు గాను అక్కడ ఏర్పాట్లు చేశారు. సైనిక ఉన్నతాధికారి సమక్షంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్... ఏర్పాట్లు పరిశీలించారు. ఉదయం నిర్వహించే తుది వీడ్కోలు ప్రక్రియకు ముందు... భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉంచాలని నిర్ణయించారు.