kodi pandelu: సంక్రాంతి వేడుకల్లో చివరి రోజైన కనుమ నాడూ కోడి పందేలు జోరుగా సాగాయి. కృష్ణా జిల్లా జిల్లాలో కోడి పందేలకు పేరుగాంచిన అంపాపురం, ఈడుపుగల్లుతో పాటు, కంకిపాడు, విజయవాడలోని భవానీపురంలో భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పందెం కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే ముగియడంతో... కోట్ల రూపాయలు చేతులు మారాయి. చాలా చోట్ల నోట్ల కట్టలు లెక్కపెట్టేందుకు ప్రత్యేకంగా యంత్రాలను ఏర్పాటు చేశారంటే... పందేలు ఏ స్థాయిలో సాగాయో అర్థం చేసుకోవచ్చు. ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసి మరీ... రాత్రి పూట కూడా జోరుగా పందేలు నిర్వహించారు.
ఈడుపుగల్లు, కంకిపాడు, భవానీపురం సహా అంపాపురంలో ఏర్పాటు చేసిన బరులకు వివిధ ప్రాంతాల నుంచి పందెంరాయిళ్లు భారీగా వచ్చారు. ఈడుపుగల్లులో వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయటంతో పాటు వీక్షకుల కోసం ఎల్ఈడీ తెరలను అందుబాటులో ఉంచారు. ఈ ప్రాంగణాలు మూడు రోజుల పాటు తిరునాళ్లను తలపించాయి. వందలాది వాహనాలు బారులు తీరాయి. బరుల ప్రాంతాలన్ని కిక్కిరిసిపోయాయి. కృష్ణా జిల్లా నందిగామ కంచికర్ల పెండ్యాలలో పెద్ద ఎత్తున జూదం నడిచింది.