ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) యాదాద్రి జిల్లాలోని దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించారు. వాసాలమర్రి ప్రజలు సీఎం (CM KCR)కు ఘనస్వాగతం పలికారు. ముందుగా గ్రామంలోని కోదండరామాలయాన్ని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. గ్రామసభ వేదికపైకి వచ్చి అందరికీ అభివాదం చేసిన అనంతరం వాసలమర్రిలోని కోదండరాముడి ఆలయానికి వెళ్లారు. ఆ తర్వాత గ్రామస్థులందరితో కలిసి భోజనశాలకు చేరుకున్నారు. అక్కడ టేబుళ్లపై కూర్చున్న గ్రామస్థుల దగ్గరికి వెళ్లి, ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, భోజనం చేయాల్సిందిగా కోరారు.
తమను ముఖ్యమంత్రి స్వయంగా పలకరించడం పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. మరికొందరు తమ సమస్యలను సీఎంకు చెప్పుకున్నారు. ఈ సమస్యలన్నింటినీ నోట్ చేసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను కేసీఆర్ (KCR) ఆదేశించారు. గ్రామస్థులు భోజనం చేస్తున్న సమయంలో చాలాసేపు కలియదిరిగి, వారిని పలకరించిన తర్వాత సీఎం కేసీఆర్ (CM KCR) వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తన పక్కన కూర్చున్న గ్రామ మహిళలకు ముఖ్యమంత్రి స్వయంగా వడ్డించారు. తర్వాత గ్రామసభలో పాల్గొన్నారు.